
బిజెపి కి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే సీఎం రమేష్ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీకి చెందిన జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఈ వార్నింగ్ ఇచ్చినట్టుగా కనపడుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో తన కంపెనీకి చెందిన పవర్ ప్రాజెక్టు పనులను ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవటాన్ని సీఎం రమేష్ మరిచిపోలేదని తాజాగా ఆయన ఫిర్యాదుతో అర్థం చేసుకోవచ్చు. జమ్మలమడుగు క్లబ్లో దేవగుడి నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు .. జూదం పై దృష్టి పెట్టాలని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ - ఎస్పీ అశోక్ కుమార్‌కు సీఎం రమేష్ లేఖ రాయటం తీవ్ర చర్చినీయాంశం అయింది. 12 టేబుల్ పై ... టేబుల్ కు 9 మంది చొప్పున 25000 - 50,000 - లక్ష వరకు జూదం బెట్టింగ్ గా నిర్వహిస్తున్నారని రమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మట్కా - లిక్కర్ దందా వంటి అసాంఘిక కార్యకలాపాలకు యధేచ్చగా పాల్పడుతున్నారని ఆయన కడప ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం రాజకీయ రంగు పులుముకున్నట్టు అయింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి సీఎం రమేష్ - ఎమ్మెల్యే ఆది మధ్య విభేదాలు బయటపడ్డాయి. రమేష్ కు చెందిన కంపెనీ చేస్తున్న పనులు తమకే కావాలని ఆది వర్గం డిమాండ్ చేయగా అంగీకరించలేదు. కొన్ని పనులు ఇచ్చామని .. కోరినన్ని ఇవ్వలేమని రమేష్ కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
దీంతో కంపెనీ ప్రతినిధులతో పాటు కార్యాలయం పై ఆది అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనిని మరిచిపోలేని సీఎం రమేష్ తాజాగా ఫిర్యాదు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి ఎంపీగా ఉన్న రమేష్ తనకు ఏమాత్రం సంబంధం లేని జమ్మలమడుగులో ఆది అనుచరుడు నిర్వహిస్తున్న క్లబ్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని చర్యలు తీసుకోవాలని కోరడం చర్చనీయాశం అయింది. ఏది ఏమైనా ఆదినారాయణ రెడ్డిని .. సీఎం రమేష్ అదను చూసి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తోంది.