ఏపీలోని కూటమి సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ వివిధ అంశాలపై పోరాటాలు నిర్వహిస్తూ వస్తోంది వైసీపీ. అందులో భాగంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న ఫీజు పోరు కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ భారీ నిరసన కార్యక్రమానికి ఆదిలోనే దెబ్బ పడింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. క్రిష్ణా గుంటూరు, ఉభయగోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
ఏడు ఉమ్మడి జిల్లాలలో కోడ్ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో నిరసనలు ఆందోళనలు రాజకీయ పార్టీలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు. మిగిలిన జిల్లాలలో వీటిని చేపట్టవచ్చు. అయితే ఏపీ మొత్తంగా ఆందోళనా కార్యక్రమాలను చేపట్టాలని భావించిన వైసీపీకి మెజారిటీ జిల్లాలలో కోడ్ ఉండడం ఇబ్బందికరంగా పరిణమించింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ ఆందోళనలకు అవకాశం ఇవ్వాలని అందులో కోరారు.
ఈసీ నుంచి స్పందన రాకపోవడం వైసీపీ తలపెట్టిన భారీ కార్యక్రమం ఫీజు పోరుకు ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉండడంతో చివరికి వైసీపీ అధినాయకత్వం తన ఆందోళనా కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం జరిగింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్ తాడేపల్లికి చేరుకున్న తరువాత తీసుకున్న కీలక నిర్ణయం ఆందోళనలు వాయిదా కావడం విశేషం. దీనిని మార్చి 12కి వాయిదా వేశారు.
ఫీజుపోరును విజయవంతం చేయాలని ఆ జిల్లా నాయకులు ముఖ్య నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ క్యాడర్ కి హుషార్ తెచ్చారు. ఇపుడు సడెన్ గా వాయిదా పడడంతో వైసీపీలో నిస్తేజం ఆవహించింది. అయితే ఇది ఎన్నికల కోడ్ వల్ల వచ్చిన ఇబ్బంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రత్యేకించి ఫీజు పోరు ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. మరి ఈ కీలక సమయంలో కూటమి ప్రభుత్వం కనుక ముందుకు వచ్చి ఫీజుల విషయంలో అనుకూల నిర్ణయం తీసుకుంటే ఫీజు పోరు వాయిదా కాస్తా ఇక పూర్తిగా ఉండకపోయినా పోవచ్చు అని అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశమే అని చెబుతున్నారు.