ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేసేలా ఉన్నాయి. ఏపీలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట ఆ అసెంబ్లీ. అలాంటి కంచుకోటలో ఇపుడు ఇంకోసారి ఉప ఎన్నిక వస్తుందని బాంబు పేల్చారు ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు.
జగన్ అసెంబ్లీకి రావడం లేదు. దాంతో ఎవరైనా శాసనసభ్యుడు అరవై రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజర్ అయితే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడి తన ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారని రఘురామ చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకుని లీవ్ పెడితే మాత్రం సదరు సభ్యుడికి ఈ వేటు బాధ ఉండదని అంటున్నారు. దాంతో జగన్ అసెంబ్లీకి ఈసారి బడ్జెట్ కనుక రాకపోతే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని రఘురామ హెచ్చరిస్తున్నారు.
అసెంబ్లీకి జగన్ హాజరై తన మనోభావాలను చెప్పుకోవాలని ఆయన కోరుతున్నారు. అసెంబ్లీకి జగన్ రావాల్సిందే అన్నట్లుగా ఆయన శాసనసభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా చెబుతున్నారు. జగన్ మీద అనర్హత కత్తి వేటు నిజంగా పడుతుందా అన్నది చర్చగా ఉంది. అసెంబ్లీకి గతంలో జగన్ రెండేళ్ళ పాటు గైర్ హాజరు అయ్యారు. ఆయన పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం మానుకున్నారు. ఆనాడు జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం పోలేదు అని గుర్తు చేస్తున్నారు.
ఇక 2019 నుంచి 2024 మధ్యలో చివరి రెండేళ్ళ పాటు చంద్రబాబు కూడా సభకు హాజరు కాలేదు. ఆయన మీద కూడా ఎటువంటి అనర్హత వేటు పడలేదు అని అంటున్నారు. ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని ఒక వాదన ఉంది. ఇక పుంగనూరు సభలో జనసేన నేత నాగబాబు అసెంబ్లీకి రాని వారికి పదవులు ఎందుకు అని నిలదీశారు. మొత్తానికి చూస్తే ఒక వ్యూహం ప్రకారమే కూటమి ముందుకు సాగుతోంది అని అంటున్నారు. మరి జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది కొద్ది రోజులలో జరగబోయే బడ్జెట్ సమావేశాలలో తేలుతుంది అని అంటున్నారు.