ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావడంతో ఏపీ రాజకీయం ఇకపై ఏకపక్షంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ వైసీపీ అధినేత కూటమి ప్రభుత్వంపై ఆది నుంచి దూకుడు ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పలువురు కీలక వైసీపీ నేతలు పార్టీ మారారు. దీంతో పార్టీ కొంచెం డీలా పడింది. పాత శక్తినంతా కూడదీసుకొని మళ్లీ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీలో సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటన జారీ విషయాల్లో జగన్ అజాగ్రత్తగా ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఇది అంతిమంగా పార్టీకి చేటు తెస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. రెట్టింపు సంక్షేమం అని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి పథకాలు అమలు చేస్తమన్నారు. సంపద సృష్టించి మరి పథకాలు అమలు చేస్తామని ఆర్భాటంగా చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు ఆ జాడలేదు. ఈ సమయంలో పోరాటం చేయాల్సిన వైసీపీ నిరసనలను వాయిదా వేస్తూ వస్తోంది.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు చేయాలని ఫీజు పోరు పేరుతో వైసీపీ ఒక కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. కానీ ఇది మూడుసార్లు వాయిదా పడింది. జనవరిలో పండుగ ముందు.. ఆ తర్వాత జనవరి 29 అని చెప్పుకొచ్చారు. అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉండడంతో వాయిదా వేస్తారు. తరువాత ఫిబ్రవరి 5 అని చెప్పారు. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఉండటంతో వాయిదా పడింది. ఈలోపు కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తే క్రెడిట్ మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది.
మరోవైపు జగన్ జిల్లాల పర్యటనకు సంబంధించి 50 రోజుల కిందట ప్రకటన చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వారానికి మూడు రోజులపాటు పర్యటిస్తానని.. ప్రతి నియోజకవర్గంలో చివరి స్థాయి నేత వరకు మాట్లాడతానని.. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటానని జగన్ ప్రకటించారు. అయితే నెలలు గడుస్తున్న ఈ జిల్లాల టూర్లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. జగన్ వీలైనంత త్వరగా జనంలోకి రావాలని లేకపోతే పార్టీ కేడర్ లో నైరాశ్యం మరింత నెలకొంటుందని విశ్లేషకులు అంటున్నారు.