అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సంచలన నిర్ణయాలతో అమెరికాలోని అక్రమ వలసాదారులను, ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు.  అక్రమ వలసదారులను ఖైదీల్లా సైనిక విమానాల్లో సొంత దేశాలకు తరలిస్తున్నారు. తాజాగా భారత్‌ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లినవారిని గుర్తించారు.  వారితో తొలి విమానం భారత్‌ బయల్దేరింది.  అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణలో భాగంగా ఈ అక్రమ వలసదారుల తరలింపు జరుగుతోంది.  


వలసదారులతో విమానం భారత్‌కు బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారని రాయిటర్‌ పేర్కొంది. సీ17 ఎయిర్‌ క్రాఫ్ట్‌లో వీరిని తరలిస్తున్నట్లు తెలిసింది. భారత్‌కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని సమాచారం.  ఈ విమానంలో గౌరవంగా 140 మంది మాత్రమే పడతారు. కానీ దాదాపు 205 మందిని తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్‌ పాసో, టెక్సాస్, శాన్‌డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5 వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌లో సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి.


ఇప్పటికే గటేమాలా, పెరూ, హోండూరస్‌ తదితర దేశాలకు విమానాల్లో పలువురిని తరలించారు. ఒక్కో వలసదారుడిని తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోది.  గతవారం గటెమాలాకు తరలించినందుకు ఒక్కొక్కరిపై 4,675 డాలర్లు ఖర్చు చేసింది. ఇక అక్రమ వలసదారుల తరలింపుపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయానికి భారత్‌ మద్దతు తెలిపింది. తాము అక్రమ వలసదారులకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.  ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉంటుందని పేర్కొంది. వీసా గడువు ముగిసిన, సరైన పత్రాలు లేకుండా భారతీయులు ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది.


ఇదిలా ఉంటే.. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా 7,25,00 మంది ఉంటున్నట్లు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్‌ కు తరలించేందుకు అమెరికా జాబితా రూపొందించిందని సమాచారం. మెక్సికో, సాల్వెడార్‌ తర్వాత భారతీయులే ఎక్కువగా అక్రమంగా ఉంటున్నారు. మెక్సికో, కెనడా, చైనాపై విధించిన 25 శాతం సుంకాల అమలు నిర్ణయాన్ని ట్రంప్‌ నెల రోజులు వాయిదా వేశారు.  మరోవైపు మెక్సికో సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: