డ్వాక్రా అంటే స్వయం సహాయక మహిళా సంఘాలు. మహిళల స్వావలంబన కోసం చంద్రబాబు గతంలో వీటిని తీసుకొచ్చారు. మహిళా సంఘాలను చంద్రబాబు మానస పుత్రిక అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. మహిళలకు మాదిరిగానే పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  వారితో పొదుపు కట్టించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు ప్రారంభించింది.  


ఇప్పటికే ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో గ్రూపులు కూడా ఏర్పాటు చేశారు.  అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రూపులో ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది.  ఇంటింటికి వెళ్లి అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.  


రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, రిక్షా కార్మికులు, కేర్ టేకర్, ఏసీ వాషింగ్ మిషన్, ప్లంబర్లు, కార్పెంటర్లు.. ఇలా అన్ని రంగాల వారిని గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేయనున్నారు. వారు చేసే వృత్తిలో నైపుణ్యం పెంచేందుకు అవసరమైన సహాయం ప్రభుత్వం అందిస్తుంది.  వీరికి శిక్షణ ఇప్పించిన తర్వాత రుణాలు కూడా మంజూరు చేస్తారు. ఆమెకు ఆర్పీలు అర్హులను గుర్తించి.. సంఘాలు ఏర్పాటు చేసిన అనంతరం రుణాలు మంజూరు చేస్తారు.


పురుషులకు డ్వాక్రా సంఘాలకు మెప్మా సహకారం అందించనుంది.  ఒక్కో గ్రూపులో ఐదుగురు నుంచి పది మంది వరకు సభ్యులు ఉంటారు.  ఈ గ్రూపులకు తొలి విడతగా పదివేల రుణం మంజూరు అవుతుంది. సకాలంలో తిరిగి చెల్లిస్తే వచ్చే ఏడాది నుంచి అదనంగా మళ్ళీ రుణం మంజూరు చేస్తారు.   డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటై స్వయం ఉపాధి పొందాలని ఆసక్తి ఉన్నవారు పట్టణాల్లో అయితే మెప్మా, గ్రామాల్లో అయితే సచివాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది.


అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ గ్రూపుల ఏర్పాటు జరిగింది. 28 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డును తీసుకెళ్లి యుసిడి కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేస్తారు.  పురుషులు కూడా గ్రూపులుగా ఏర్పడితే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు.  మొత్తానికైతే ఏపీలో పురుషుల డ్వాక్రా సంఘాల ఏర్పాటు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: