అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఎఫ్-1 వీసాదారులు పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే ప్రస్తుతం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇటీవల మిషిగన్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.  వీరు క్యాంపస్ బయట అనధికారికంగా పని చేస్తున్నట్లు మూడు రోజులపాటు నిఘా పెట్టి గుర్తించారు.  ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వీసాదారులందరిలోనూ గుబులు మొదలైంది.


డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి వలసదారులపై కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. అక్రమంగా పార్ట్-టైం ఉద్యోగాలు చేసేవారిపై ఐసీఈ  ప్రత్యేక దృష్టి సారించింది.  ఫిబ్రవరి 15లోగా ఆ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  


2024లోనే అమెరికా 84,000 భారతీయులకు ఎఫ్-1 వీసాలను మంజూరు చేసింది. ఇందులో 25,000 మంది వరకు తెలుగు విద్యార్థులే. చాలామంది విద్యార్థులు పూర్తి సమయ చదువు పేరుతో వెళ్లి, ఖర్చులు భరించేందుకు పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తున్నారు.  కానీ, అమెరికా చట్టాల ప్రకారం క్యాంపస్ బయట అనధికారికంగా పని చేయడం నేరం. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు భద్రత కోసం విధులకు హాజరుకావడం మానేశారు. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పని చేసే భారతీయులు గత వారం రోజులుగా డుమ్మా కొడుతున్నారు. ఇది భారతీయ వ్యాపారాలు కూడా దెబ్బతినేలా చేసే అవకాశముంది.


విద్యార్థులలో ఎక్కువ మంది “ఓపీటీ  ప్రోగ్రాంలో ఉంటారు.  ఇది 12-36 నెలల పాటు వృత్తిపరమైన అనుభవం పొందే అవకాశాన్ని ఇస్తుంది. తర్వాత వారు హెచ్-1బీ వీసా ద్వారా ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఓపీటీ, హెచ్-1బీ వీసా పొడిగింపుపై అనిశ్చితి నెలకొంది. ఇది భవిష్యత్తులో గ్రీన్‌కార్డ్ సాధించే అవకాశాలను తగ్గించవచ్చు. భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికాలో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.  అమెరికాలో చదువు కోసం వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.  పార్ట్-టైం ఉద్యోగాలకు భారీ ప్రభావం - భారతీయులు ఎక్కువగా పనిచేసే రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లకు కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: