గతేడాది ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో ఉండేవారు ఎవరో.. పార్టీ మారే వారు ఎందరో ఏమీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా పార్టీ మారిన వారిలో వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు, జగన్ నమ్మకస్తులు ఉండటం విశేషం. ఏది ఎలా ఉన్నా పార్టీలో రాజీనామాలకు మాత్రం ఫుల్ స్టాఫ్ పడటం లేదు. ఆ విధంగా అధినేత చర్యలు లేవన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఇక తాజాగా జగన్ అత్యంత సన్నిహితుడు విజయ సాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. పార్టీకే కాక ఏకంగా రాజకీయాలకే ఆయన గుడ్ బై చెప్పారు. ఎందుకు ఇలా చేశారో ఇప్పటికీ రీజన్ తెలియదు. అది కూడా జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో పార్టీ పదవులకు, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయసాయితో పాటు మరికొందరు సీనియర్లు పార్టీకి రాజీనామాలు చేశారు. తాజాగా లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్ పార్టీ శ్రేణులతో తాడేపల్లి ప్యాలెస్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ ముఖ్యులతో జగన్ మాట్లాడుతూ..
`ఇంకో 20 మంది దాకా వెళ్లిపోతారు. మనం ఏమీ బాధపడొద్దు. ఈ విషయంలో ఏం జరిగినా.. పార్టీకి వచ్చిన నష్టం లేదు. ప్రజలే అల్టిమేట్` అని జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంటే.. ఆయన మానసికంగా రెడీ అయ్యారన్న సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల విషయంలో ముగ్గురు నుంచి ఐదుగురు వరకు కూడా కూటమికి పరోక్షంగా సహకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి అంటుముట్టనట్టే ఉంటున్నారు.
రాజ్యసభ సీట్ల విషయానికి వస్తే.. ఇప్పటికి ముగ్గురు పార్టీ మారారు. ఇక, మిగిలిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో నత్వానీ.. ఎలానూ టచ్‌లో లేరు. మరో ఆరుగురు ఉన్నారు. వీరిలోనూ ముగ్గురు వ్యాపార వేత్తలు ఉన్నారు. దీంతో వీరిపై ఒత్తిళ్లు సహజం. ఈ నేపథ్యంలో వారు పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. లోక్‌సభ సభ్యుల విషయానికి వస్తే.. అందరూ సేఫే అనే చర్చ ఉంది. దీంతో ఎంత మంది పార్టీ మారినా తనకు పార్టీకి ప్రజలే అల్టిమేట్ అని జగన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ మానసికంగా రెడీ అయ్యారన్నది విశ్లేషకుల మాటగా ఉంది.