మాజీ ప్రధాని దేవెగౌడ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు ఇవి చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అసలేం జరిగిందంటే.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ ప్రధాని అయిన గడిచిన మూడు ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు.
2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రాగా.. ఎన్డీయే కూటమిలోని వివిధ ప్రాంతీయ పార్టీల కారణంగా మోడీ 3.0కు 305 సీట్లు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాత్రమే కాక.. కూటమికి పవర్ సెంటర్ గా చైర్ పర్సన్ ఉండేవారని.. కానీ ప్రధాని మోడీ మాత్రం కూటమిని నడిపించటానికి లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటానికి ఎవరినీ అనుమతించలేదున్నారు. 2024లో మోడీకి 240 సీట్లు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు జోక్యానికి నో చెప్పారన్నారు. ఎన్డీయే కూటమికి వైస్ ఛైర్మన్ లేదంటే ఛైర్మన్ కావాలని చంద్రబాబు కోరుకున్నారని.. కానీ మోడీ మాత్రం రిజెక్టు చేశారన్నారు.
పాలన ఎలా నిర్వహించాలో మోదీకే తెలుసన్న దేవగౌడ.. ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మోదీ ఈ దేశాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా నడిపే నాయకుడిగా పేర్కొన్నారు. తాను నిజం చెబితే అంగీకరించాలని.. తాను ఏదైనా తప్పు మాట్లాడితే తనపై దాడి చేయొచ్చన్నారు. మొత్తంగా చంద్రబాబు ఎపిసోడ్ ప్రస్తావించటం ద్వారా మోదీ బలాన్ని.. ఆయనకున్న ధీమాను చెబుతూనే.. చంద్రబాబు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితిని బయటపెట్టారని చెప్పాలి.
దేవెగౌడ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీనడ్డా మాట్లాడుతూ.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఎన్డీయేలో చంద్రబాబును ఛైర్మన్ చేయాలన్న దానిపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అందరూ కలిసే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు నడ్డా స్పష్టం చేశారు. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.