
ఒకప్పుడు దిల్లీని కాంగ్రెస్ పార్టీ ఏలింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం దారుణంగా ఉంది. దేశరాజధానిలో ఒకప్పుడు హస్తం హవా నడిచింది. దాదాపు 15 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగింది. పదేళ్ల క్రితం వరకు దిల్లీలో కాంగ్రెస్ బలీయ శక్తిగానే ఉంది. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అయిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పతనం మొదలైంది. రోజురోజుకీ ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఎన్నికల్లో లెక్కలేనన్ని హామీలు ఇచ్చినా కనీసం ఆ పార్టీని దిల్లీ ప్రజలు పట్టించుకోలేదని దిల్లీ ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే.. ఈ సారి కూడా కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో కాంగ్రెస్ వరుసగా మూడో సారి కూడా ఖాతా ఓపెన్ చేయలేదు. కాంగ్రెస్ ఓట్ షేరింగ్ లో స్వల్ప మెరుగుదల కనిపించింది. చాలా మంది ప్రముఖ నాయకులు ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆ పార్టీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోయారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు.
వారిలో కస్తూర్బా నగర్ నుంచి అభిషేక్ దత్ రెండో స్థానంలో నిలిచిన ఏకైక కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. డిపాజిట్ దక్కించుకున్న నేతల జాబితాలో రోహిత్ చౌదరి, దేవేంద్ర యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులలో ఎక్కువ మంది బీజేపీ లేదా ఆప్ తర్వాతే మూడో స్థానంలో ఉన్నారు. కొన్ని స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల కంటే కూడా వెనుకబడి ఉండడం గమనార్హం. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ కూడా మూడో స్థానంలో నిలిచారు.
ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ భారీ నష్టాలను చవిచూసింది. అక్కడ కాంగ్రెస్ ఆప్ ను పణంగా పెట్టి స్వల్పంగా ఎక్కువగా ఓట్లను సాధించగా.. బీజేపీ లాభపడింది. ఈ ఎన్నికల్లో ఆప్ ఓట్ల వాటా 10 శాతం తగ్గింది. కాంగ్రెస్ ఓట్ల వాటాలో 2.1 శాతం మెరుగుదల కనిపించింది. కానీ ఈ ఓట్ల వాటాను సీట్లుగా మార్చలేకపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి 6.39 శాతం చెల్లుబాటయ్యే ఓట్లు వచ్చాయి.