2026 నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి జనవరి 6న ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అవిరామంగా ఆపరేషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నక్సలిజం వల్ల ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని చెప్పారు. నక్సల్స్ రహిత భారత్ ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా.. చేతల్లో చూపిస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లు మావోయిస్టు పార్టీలకు కోలుకోలేని షాకులు ఇస్తున్నాయి. తాజాగా ఓ భారీ ఎన్ కౌంటర్ జరగగా.. అందులో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది.
ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ చరిత్రలోని రెండో భారీ ఎన్ కౌంటర్ గా దీన్ని పేర్కొంటున్నారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రత బలగాలకు కీలక సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో.. ఇంద్రావతీ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆదివారం తెల్ల్వారుజామున భద్రతా బలగాలు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ ఘటనపై తాజాగా బస్తర్ ఐజీ సుందర్ రాజు స్పందించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు ధృవీకరించారు. మరోపక్క ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశంలో కాల్పులు కంటిన్యూ అవుతున్నట్లు సమాచారం. ఈ నెల 20న ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. నౌపాడ, గరియాబంద్ జిల్లాల్లో భద్రతా బలగాలకు - నక్సలైట్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.