![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/prasanth-kishore13e3d35d-7bd9-48df-b123-5e5f933fe29a-415x250.jpg)
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఆశించిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆప్ తో పాటు ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగానే సీట్లు సంపాదించుకుంది. అలాగే న్యూఢిల్లీలో సీటులో కేజ్రివాల్ ఓటమి పాలయ్యారు. దీనిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
ఢిల్లీ మద్యం స్కాంలో పలువురు ఆప్ కీలక నేతల అరెస్టు తర్వాత చివరిగా సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రివాల్ అరెస్టు అయ్యారు. అయితే ఆ అరెస్టు తర్వాత కేజ్రివాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. అలా చేయకుండా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టుల్లోనూ సుదీర్ఘ పోరాటం చేసి చివరికి బెయిల్ తెచ్చుకుని అనంతరం తన సీఎం పదవిని వదులుకున్నారు. ఆ సీట్లో పార్టీలో సీనియర్ నేత అయిన అతిషిని కూర్చోబెట్టారు. ఇదే అతిపెద్ద రాజకీయ తప్పిదమని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
లిక్కర్ స్కాంలో అరెస్టు తర్వాత కేజ్రివాల్ తన పదవికి రాజీనామా చేసేసి ఉంటే పరిస్ధితి మరోలా ఉండేదని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. అలా చేయకుండా బెయిల్ కోరడంతో ఢిల్లీలో ఆప్ కోటకు బీటలు వారడం మొదలైందని పీకే తేల్చేశారు. అలాగే కేజ్రివాల్ ఈ మధ్య కాలంలో తరచుగా తన రాజకీయ అభిప్రాయాల్ని మార్చుకోవడం కూడా ఢిల్లీలో ఆప్ చిత్తుగా ఓడేందుకు కారణమైందని ప్రశాంత్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరడం, ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ ను కలుపుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం వంటి తప్పిదాలు చేశారన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి పదేళ్ల ప్రజా వ్యతిరేకతే ప్రధాన కారణమని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఆ తర్వాత కేజ్రివాల్ రాజీనామా చేయకుండా బెయిల్ కోరడం ఉందన్నారు. ఢిల్లీ వరదలు, కేజ్రివాల్ ఢిల్లీని వదిలి ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం వంటి కారణాలు కూడా ఓటర్లలో ఆయనపై అభిప్రాయం మార్చుకునేందుకు కారణమయ్యాయన్నారు.