![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/revanth-reddy2c3d2bd7-d178-439b-a040-bd77c310b029-415x250.jpg)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించారు. కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిసి రావాలని సంచలన పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీ పుదుచ్చేరి కూడా ఏకమవ్వాలని కోరారు.
రాజ్యాంగ బద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు పోరుడుదామని దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్.. డీలిమిటేషన్ ఎజెండాతో మోడీ ముందుకు సాగుతున్నారన్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం వల్ల పార్లమెంట్ స్థానాలకు గండిపడే ప్రమాదం ఉందన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు గళం విప్పాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు.
ఉత్తరాధి రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు పునర్విభజన చేపడితే మనకు అదనంగా నియోజకవర్గాలు రాకపోగా కొన్నింటిని కోల్పోతామని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలను పెంచాలని తాను ప్రధాని మోదీకి సూచించినట్లు తెలిపారు. జనాభా దమాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని.. దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని, 1 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించిందన్నారు. దీంతో దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ వివరించారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 25 వేల కోట్ల పెట్టుబడులే తెచ్చిందని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలల వ్యవధిలోనే 1.82 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని రేవంత్ వెల్లడించారు.