దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఓట్ల లెక్కింపు వేళ చీపురు పార్టీని కమలం ఊడ్చేసిందన్న వాదనలు వినిపించాయి. అయితే ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత ఆయా పార్టీలు సాధించిన ఓట్లు వాటి మెజార్టీలు అభ్యర్థుల సాధించిన ఆధిక్యతలు గత ఎన్నికల ఫలితాల్లో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం వంటి అంశాలపై ఫోకస్ చేస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.


తాజాగా దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగాయో నిరూపించే కీలక గణాంకాల్ని ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది.  ఓట్ల లెక్కింపు తర్వాత 48 సీట్లతో బీజేపీ విజయం సాధించగా..22 సీట్లు సాధించిన ఆప్ చతికిలపడింది.   కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది.  ఇదంతా పైకి కనిపిస్తున్న చిత్రం. కానీ ఆయా పార్టీలు సాధించిన ఓట్ల శాతాలు గమనిస్తే ఢిల్లీలో అసలేం జరిగిందో అర్దమవుతుంది.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, ఓడిన ఆప్ తో పాటు ఇతర పార్టీలు సాధించిన ఓట్ల శాతాల్ని ఈసీ విడుదల చేసింది. ఇందులో బీజేపీ, ఆప్ మధ్య ఓట్ల శాతంలో తేడా 2 శాతమే అని తేలిపోయింది.  బీజేపీకి 45.56 శాతం ఓట్లు లభిస్తే, ఆప్ కు 43.57 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి 6.34 శాతం ఓట్లు వచ్చాయి.  


ఈసీ తుది గణాంకాల్ని బట్టి చూస్తే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య ముఖాముఖీ పోరు మాత్రమే కాదు పలు చోట్ల ముక్కోణపు పోటీ జరిగిందని అర్ధమవుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 4 శాతం ఓట్లు పెంచుకుంది. అలాగే బీజేపీ, ఆప్ మధ్య ఓట్ల శాతంలో తేడా 2 శాతమే. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆప్ ను ఏ స్ధాయిలో దెబ్బతీసిందో అర్దమవుతోంది. మరోవైపు రెండు శాతం ఓట్లతో గట్టెక్కిన బీజేపీ అన్ని సీట్లు ఎలా సాధించిందంటే.. స్థానికంగా సమీకరణాల్ని వర్కవుట్ చేయడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అందుకే దాదాపు 7-8 మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న సీట్లు కూడా బీజేపీ గెల్చుకుంది. ఆయా సీట్లలో కాంగ్రెస్ గణనీయంగా ఆప్ ఓట్లు చీల్చేసినట్లు అర్దమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: