దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ఠ్ పంజాబ్ ప్రభుత్వంపై పడిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఉంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటేనే పార్టీ మనుగడ సాగుతోంది. లేదంటే పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మంగళవారం కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో సహా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలవనున్నారు. 2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై కేజ్రీవాల్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీలో ఎదురైన పరిస్థితుల గురించి కూడా చర్చించనున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. పంజాబ్‌లో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని.. వారంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని బాంబ్ పేల్చారు. ఢిల్లీలో ఆప్ ఓటమి తర్వాత కూడా కాంగ్రెస టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఇరు పార్టీల మధ్య వార్ చల్లారలేదు. మోసం, అబద్ధాలు, నెరవేర్చలేని వాగ్దానాలతో పాలన ముగిసిందంటూ ఆప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను ఆప్ సీరియస్‌గా చూస్తోంది. ఈ వ్యాఖ్యలపై కూడా రేపటి కేజ్రీవాల్ సమావేశంలో చర్చకు రానున్నాయి.
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ఆప్ కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్‌ను ఘోరంగా దెబ్బకొట్టింది.
ఇక పంజాబ్ లో 117 అసెంబ్లీ సీట్లు ఉండగా ఆమ్ ఆద్మీ 93 చోట్ల విజయం సాధించింది. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 16, బీజేపీకి 2 అకాలీదళ్ కు మూడు సీట్లు లభించాయి. ఇప్పటికిప్పుడు ఆప్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకున్నా.. చీలిక వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. మరి పంజాబ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి.