చాలా ఏళ్ల తర్వాత దేశ రాజధాని దిల్లీలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ మ్యానిఫెస్టోలో గతంలో ప్రకటించిన విధంగా హామీల వర్షం కురిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ హామీలు కూడా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేశాయని చెప్పవచ్చు. ఎప్పుడు అభివృద్ధి మంత్రం జపించే బీజేపీ తొలిసారి సంక్షేమం వైపు అడుగులు వేసింది. ఆ మేరకు ప్రజారంజక పథకాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి ఎన్నికలకు వెళ్లింది.
ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. ఇప్పుడు ఇచ్చిన హామీల అమలు ఆ పార్టీకి సవాలుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పేద మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు నెలకు రూ.2,500 పింఛను, 70 ఏళ్లు దాటితే రూ.3,000, గర్భిణులకు రూ.21 వేలు, పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వంటి హామీలను బీజేపీ ప్రకటించింది. దీంతో పాటు గ్రిగ్, వస్త్ర కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు పలు హామీలు ఉన్నాయి.
అయితే హామీల ఆర్థిక భారం ప్రస్తుతం ఢిల్లీ ఆర్థిక పరిస్థితిలో స్పష్టంగా కనిపిస్తోంది. 2024-25 సంవత్సరానికి అంచనా వేసిన పన్ను ఆదాయం రూ.58,750 కోట్లు ఉండగా.. మొత్తం బడ్జెట్ రూ.76 వేల కోట్లుగా ఉంది. ప్రస్తుతం అర్హులకు అందుతున్న లబ్ధిని కొనసాగించడంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి అదనంగా ఏడాదికి రూ.25 వేల కోట్లు వరకు అవసరం అవుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హామీలు అమలు బీజేపీ పెద్ద సవాలు అని చెప్పవచ్చు.
పేద మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలంటే ఏడాదికి రూ.11 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఢిల్లీలో 24.4 లక్షల మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలంటే ఏడాదికి అదనంగా మరో రూ.4,100 కోట్లు అవసరం. యమునా నది ప్రక్షాళనకే గత కొన్నేళ్లుగా దాదాపు రూ.8 వేల కోట్ల ఖర్చవుతోంది. ఇక ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10,200 కోట్లు కావాలి. అయితే కేంద్రం అధికారంలోకి ఉంది కాబట్టి ఇవన్నీ అమలు చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. మరి ఈ హామీలు అమలు అవుతాయో లేదో అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.