పరీక్ష రాసిన 17 ఏళ్లకు ఉద్యోగాలు వచ్చిన ఘటన ఆశ్చర్యం గొలుపుతోంది. అది కూడా హైకోర్టు చెబితేనే ఆ అవకాశం దక్కుతోంది. ఇదీ డీఎస్సీ 2008 అభ్యర్థులు గోడ..  ఏళ్ల తరబడి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయరా అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్  నరసింహారెడ్డిని హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. కనీసం కోర్టు ఉత్తర్వులను అయినా గౌరవించాలని హైకోర్టు సూచించింది.


30 వేల ఎస్జీటీ పోస్టుల భర్తీకి 2008 డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యాక డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించడంతో వివాదం మొదలైంది. 2008లో నోటిఫికేషన్లో డీఎడ్ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలిన 2367 పోస్టులను అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులను ఏపీలో వలె కాంట్రాక్ట్ పద్ధతిన నియమించాలని హైకోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. 2367 మందికిగాను 1382 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలకు ఆసక్తి చూపారని, ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి రావడంతో నియామకాలకు కొంత గడువు కావాలంటూ  హైకోర్టును ప్రభుత్వం గడువు కోరింది. ఎన్నికల నియమావళి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డంకి కాదని వాటిని అమలు చేయాల్సిందేనంటూ గత వారం తేల్చి చెప్పడంతో.... విచారణకు హాజరైన విద్యాశాఖ కమిషనర్..... పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.


మీరు మనుషులేనని, విన్నచిన్న తప్పులు జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు నిన్నటి విచారణలో వ్యాఖ్యానించింది. కోర్టు దిక్కరణ కింద మీకు వ్యతిరేకంగా ఏదైనా వ్యాఖ్య రాస్తే ఉన్నత పదవుల్లో ఉన్న మీ భవిష్యత్తుకు ఇబ్బంది ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2008 డీఎస్సీకి సంబంధించి 1382 పోస్టుల భర్తీ వ్యవహారంపై జస్టిస్ అభినంద్‌ కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవిలతో కూడిన ధర్మాసనం నిన్న మరోసారి విచారణ చేపట్టింది.


ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ డీఎస్సీ 2008కి సంబంధించి 1382 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నామని తెలిపారు. నియామకం చేపడతామనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అలా కాని పక్షంలో అధికారులు హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చామని తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: