ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. అలా అయితేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏకంగా న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. కోర్టులో ఇంకా విచారణ పూర్తి కాలేదు.  ఇదిలా ఉండగా ఈ నెల 20 నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి వీటికి జగన్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.


 ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు సహేతుక కారణం లేకుండా 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేశారు.  మరోవైపు జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరుపై ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాని సభ్యుడిపై అనర్హత వేటు వేసేలా చట్టాలు ఉన్నాయని రఘురామ తెలిపారు.  ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా డిప్యూటీ స్పీకర్ వాదనను బలపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తాము ఎలా ఇస్తామని, ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందున ఆ పదవికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు సైతం వ్యాఖ్యానించారు.  అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేయడం వింతగా ఉందని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.  దేశంలో ఎక్కడైనా ఇలాంటి పద్ధతి ఉందా? అంటూ నిలదీశారు.  చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? లేదా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాలని జగన్ కోరుతున్నారని, ఏ రూల్ ప్రకారం ఆయన అలా అడుగుతున్నారో చెప్పాలని కోరారు.


అనర్హత వేటుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.  జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందంటూ రఘురామ చెప్పారు. ఆయనను సమర్థిస్తూ ఇప్పుడు అయ్యన్నపాత్రుడు కూడా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: