చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం లో మాజీ మంత్రి ఆర్కే రోజాకు వైసీపీ అధినేత జగన్ భారీ షాక్ ఇవ్వబోతున్నారా ? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవునని అంటున్నాయి వైసిపి వర్గాలు. 2014 - 2019 ఎన్నికలలో రెండుసార్లు వరుసగా నగర నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే వైసిపిలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ క్యాబినెట్లో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా ను ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ ఆమె హవాను తగ్గించే ప్రయత్నం చేశారన్న చర్చలు ఉన్నాయి. అయితే గత ఎన్నికలలో ఆమె గాలి భాను ప్రకాష్ నాయుడు చేతిలో భారీ ఓటమి చెందారు. ఓట‌మి తర్వాత ఆమె నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉన్నారు.. కేడర్ను అసలు పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలో వర్గ పోరు పెంచడం వల్లే ఆమెకు .. పార్టీకి 2024 ఎన్నికలలో తీవ్ర నష్టం జరిగింది.


అయితే ఇప్పుడు నియోజకవర్గం పై ఆమె పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రోజాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం నగరి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న గాలి భాను ప్రకాష్ నాయుడు సోదరుడు గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. అసలు గాలి జగదీష్ గత ఎన్నికల్లో తనకి టిడిపి సీటు కావాలని పట్టు పట్టారు. అయితే చంద్రబాబు భాను ప్రకాష్ కే సీటు ఇచ్చారు. ఈ పరిణామాలతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు. 2029 ఎన్నికలలో వైసిపి న‌గ‌రి టిక్కెట్ ఇస్తే తాను పార్టీలో చేరతాను అని జగదీష్ కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందుకు వైసిపి అధినాయకత్వం ఓకే చెప్పడంతో ఆయన ఈ నెల 12న తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది. గాలి కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టుతో పాటు జగదీష్ సొంత మామ కర్ణాటకలో బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అక్కడ కట్టా సుబ్రహ్మణ్యం నాయుడికి మంచి పేరు ఉంది. ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తులు ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రంగంలోకి దిగి రోజాకు చెక్ పెట్టేందుకు జగదీష్ ను వైసీపీలోకి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: