![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/mamathae12278aa-2f69-4c19-87e0-53a1f5d04ed5-415x250.jpg)
దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ల ఓటమి పొత్తు అవసరాన్ని గుర్తు చేసిందని ఇండియా కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. ఆప్ అవకాశాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీయే తమతో పొత్తు వద్దనుకుందని కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సొంతంగానే పోటీ ఉంటుందని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్.. ప్రస్తుతం ఇండియా కూటమిలోనే ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పొత్తు ఉండబోదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మమత ప్రసంగించారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఏమీ లేదని.. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్‌కు కాంగ్రెస్ సాయం చేయలేదని.. హర్యానాలో కాంగ్రెస్‌కు ఆప్ సాయం చేయలేదని.. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకరికొకరు సాయం చేసుకోకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని చెప్పారు.
2026లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ సహా ఇతర ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. సంకీర్ణానికి అవకాశమే లేదని సీఎం మమత తేల్చి చెప్పేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజార్టీతో గెలవబోతున్నట్లు మమత విశ్వాసం వ్యక్తం చేశారు. వరుసగా నాలుగో సారి బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడం ఇండియా కూటమికి కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. అయినా ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు బెంగాల్ లో అధికారంలోకి వచ్చింది. అయితే నాలుగో సారి గెలుస్తామనే ధీమాను సైతం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేజ్రీవాల్ చేసిన తప్పే మమత చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఫలితాలు భిన్నంగా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మమత డెసీషన్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.