అక్రమ వలసదారుల ఏరివేత.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ క్షణాన మొదలు పెట్టారో కానీ.. ప్రపంచం అంతటా ఇప్పుడితే హాట్ టాపిక్ గా మారింది.  ఇప్పటికే భారత్ తో పాటు పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని గుర్తించి అరెస్టులు చేసి స్వదేశానికి తమ విమానాల్లోనే  పంపేస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే అమెరికా మిత్రదేశం బ్రిటన్ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. అరెస్టులు చేసి అక్రమ వలసదారుల్ని వెళ్లగొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది.


స్వదేశంలో భారీగా అక్రమంగా పాగా వేసిన భారతీయ వలసల్ని గుర్తించేందుకు భారీ డ్రైవ్ చేపట్టింది. బ్రిటన్ ప్రభుత్వం.  అమెరికా తరహాలోనే అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించే భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్‌లు, కన్వీనియన్స్ స్టోర్‌ల, కార్ వాష్‌లను లక్ష్యంగా చేసుకుని ఇవాళ దేశవ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపట్టింది.  బహిష్కరించాల్సిన అక్రమ వలసదారులను బస్సు నుంచి దించి విమానం మెట్లు ఎక్కుతున్నట్లు చూపించే వీడియోను బ్రిటన్ హోమ్ ఆఫీస్ ఇవాళ విడుదల చేసింది. గత ఏడాది జులైలో లేబర్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు 19వేల మంది శరణార్థులు, విదేశీ నేరస్థులు, బ్రిటన్ కు వచ్చిన నేరస్థులు ఉన్నట్లు తెలిపింది.


బ్రిటన్ లో ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జనవరిలో మొత్తం 828 ప్రాంగణాలపై దాడులు చేసి 609 మందిని అరెస్టు చేసి రికార్డు సృష్టించాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఈ దాడులు 48 శాతం పెరిగాయని అధికారులు తెలిపారు. అరెస్టుల సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 73శాతం పెరిగిందని వెల్లడించారు. తాజాగా ఉత్తర ఇంగ్లండ్‌లోని హంబర్‌సైడ్‌లో ఉన్న భారతీయ రెస్టారెంట్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేసి ఏడుగురిని అరెస్టు చేసి, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు హోం ఆఫీస్ వెల్లడించింది. ఇక ట్రంప్ సర్కారు సైతం గత కొన్ని రోజుల నుంచి అక్రమ వలసదారులను ఏరివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ నిర్ణయంతో మరెన్ని దేశాలు ఈ బాటలో పయనిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

uk