కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఈసారి జమిలి ఎన్నికలు ఖాయమని ఎప్పుడో తేల్చేసింది.  ఇప్పుడు వరుసగా హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న కేంద్రం.. జమిలి ఎన్నికల్ని ముందుకు జరుపుతోందా ? ఈ మేరకు ఢిల్లీలో ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా ? అంటే అవునంటున్నారు ఏపీకి చెందిన మాజీ కేంద్రమంత్రి. ఈ మేరకు అలర్ట్ గా ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు.


మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.  అక్కడ పార్టీ పెద్దలతో పాటు పలువురు కీలక వ్యక్తుల్ని ఆయన  కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాజకీయం మారుతోందన్న అంశాన్ని ఆయన తెలుసుకున్నారు.  అంతే కాదు దాన్ని బయటపెట్టారు కూడా.  అంతా ఊహిస్తున్నట్లుగా 2028లోనే 2029లోనో కాదు 2027లోనే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చింతా మోహన్ తెలిపారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ మేరకు జమిలి ఎన్నికల విషయంలో జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. నిన్న తాను ఢిల్లీ వచ్చానని, కాసేపు అటూ, ఇటూ తిరిగానని, ఢిల్లీలో దాగివున్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందని చింతా మోహన్ తెలిపారు.  ఇక జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబుకే నష్టమని అందుకే ఆయన జమిలికి ఒప్పుకోరని కూడా చెప్పారు.


ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఏపీలో మళ్లీ జగన్ బలపడే అవకాశమే లేదన్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగడం లేదని.. హైదరాబాద్ లో కూర్చుంటే పనులు జరగడం లేదని ప్రస్తుతం ఈవీఎంల మేనేజేమెంట్ జరుగుతోందని గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని తెలిపారు. మొత్తం మీద జమిలి ఎన్నికలు ముందుగానే వస్తాయని ఆయన తన విశ్లేషణలో స్పష్టం చేశారు. మరి ఇవి ఎవరికీ మేలు చేస్తాయో.. ఎవరికీ నష్టం తెస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: