ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. ఏపీ అప్పుల మయం అయిందని.. కనీసం పథకాలు అమలు చేయాలన్నా నిధులు లేవని.. అందుకే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోతున్నాని చెబుతున్నారు.  ఇదిలా ఉండగా తాజాగా  వీఐపీల భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


రాష్ట్ర ప్రభుత్వం  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, వీఐపీల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సివుందని అంటున్నారు.  దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.9.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 10 ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేయనుంది.  వీటికి బుల్లెట్ ప్రూఫ్ ఫ్రాబ్రికేషన్ చేయించాలని సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలో కొందరు ముఖ్యనేతలు, రాష్ట్రానికి అతిథులుగా వచ్చే వారి కోసం ఈ కొత్త వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు.



పర్యాటక ప్రాంతాలు, తిరుమల వంటి పుణ్య ప్రదేశాలు సందర్శనతో పాటుగా వ్యాపార రాజకీయ కారణలతో వీఐపీలు రాష్ట్రానికి వస్తున్నారు. వ్యాపార వేత్తలు ,పారిశ్రామిక వేత్తలు తరచూ పెట్టుబడులు పెట్టేందుకు పర్యటిస్తున్నారు. అందుకే ఏపీలోని ప్రముఖులతో పాటు రాష్ట్రానికి వచ్చే ముఖ్యుల కోసం రక్షణగా ఉంటాయనే ఉద్దేశంతో కొత్తగా బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.


అయితే గతంలో వైసీపీ సర్కారు వాహనాలను ఇదే మాదిరిగా కొనుగోలు చేసింది. ఆ సమయంలో టీడీపీ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు చేసింది టీడీపీ. అయితే ఇప్పుడు సెక్యూరిటీ వాహనాలు ఉన్నా అదనంగా కొనుగోలు చేయడం విశేషం. అయితే ఎనిమిది నెలల కిందటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు దూరంగా ఉండాలని భావించింది. కానీ ఇప్పుడు ప్రముఖుల పేరుతో రూ.10 కోట్ల ను కేవలం వాహనాలకే కేటాయించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: