![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/tandel34e85d38-2661-41a8-ba16-9292c778b177-415x250.jpg)
ఈ సినిమాను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. దీనికి చెక్ పెడుతూ.. టీడీపీ నాయకులు కూడా.. తండేల్ కథ ద్వారా.. చంద్రబాబు చేసిన కృషిని వెలుగులోకి తెచ్చారు. ఇది రాజకీయంగా ఇరు పక్షాల మధ్య వివాదానికి దారితీసింది. తండేల్ వచ్చిన తొలి రోజు.. కొన్ని ప్రధాన పత్రికల్లో ఈ సినిమాలపై రివ్యూలతోపాటు.. ప్రత్యేక కథనాలు కూడా రాసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా మత్య్సకారుల దీనగాధలు ఇవీ.. అంటూ పేజీలకు పేజీలు వార్తలు రాశారు.
దీనిలో చంద్రబాబును హైలెట్ చేస్తూ.. మత్స్యకారుల అభ్యున్నతికి గతంలోనే చంద్రబాబు అనేకం చేశా రని.. శ్రీకాకుళం మత్య్సకారుల కోసం.. ప్రత్యేక జెట్టీలను ఏర్పాటు చేశారని, వారికి పింఛన్లు కల్పించారని పేర్కొంటూ.. ఆకాశానికి ఎత్తేశారు. ఈ పత్రికల కథనాలను హైలెట్ చేస్తూ.. శ్రీకాకుళం జిల్లాటీడీపీ నాయకు లు కూడా.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే.. ఇదేసమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం మత్స్యకారులను రక్షించామంటూ.. వైసీపీ మరో వ్యూహంతో ముందుకు వచ్చింది.
చంద్రబాబు హయాంలో చేసింది ఏమీ లేదని.. అందుకే 2022లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 40 మంది మత్స్య కారులు పాకిస్థాన్ జలాల్లో వేటకు వెళ్లారని.. అక్కడ పట్టుబడితే.. తమ నేత జగనే వారిని రక్షించి వెనక్కి తీసుకువచ్చారని వైసీపీ నాయకులు ఎదురు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా.. వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తూనే ఉంది. దీంతో అసలు ఏ పార్టీ మత్సకారులకు.. అనుకూలంగా ఉంది? ఎవరు ఏం చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది.
తండేల్ సినిమా ఎలా ఉన్నా.. రాజకీయంగా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఈ సినిమా మరో వివాదానికి కారణంగా మారింది. అయితే.. పార్టీల అధినేతలు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనలూచేయకుండా మౌనంగా ఉండడం గమనార్హం.