![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/bearlu835c65ec-4597-4362-aaab-12a10b12c819-415x250.jpg)
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో వేసమి ముందు మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. చల్లని నీళ్లు, శీతల పానీయాలు బీర్లు లాగించేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీర్ల ధరలు 15 శాతం పెంచుతూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ధరలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే నాలుగు నెలల్లో బీర్ల విక్రయం పెరిగి ప్రభుత్వానికి మరింత ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. బీర్లలో ఏ బీరు ధర ఎంత పెరుగుతుంది అని మందుబాబులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బ్రాండును బట్టి బీర్ల ధరలు పెరుగనున్నాయి.
లైట్ బీర్ ధర ప్రస్తుతం రూ.150 ఉండగా, కొత్త ధర ప్రకారం దాని రేటు రూ.172కు పెరుగుతుంది. ఇక స్ట్రాంగ్ ప్రీమియం ధర ప్రస్తుతం రూ.160 ఉండగా, దానిని రూ.184కు పెంచారు. బడ్వైజర్ లైట్ బీరు ధర ప్రస్తుతం రూ210 ఉండగా, రూ.241.5కు, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ ధర రూ.230 నుంచి రూ.253కు పెరిగింది. బడ్వైజర్ మ్యాగ్నం ధర రూ.220 ఉండగా పెంచిన తర్వాత రూ.253కు చేరింది. టూబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగింది. అయితే లిక్కర్ రేట్ల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటి ధరలు యథాతదంగా కొనసాగనున్నాయి.
ఇక ఏపీలో కూడా మద్యం ధరలు పెరిగాయి. అయితే రూ.99 మద్యం బాటిల్, బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్లపై రూ.10 చొప్పున ధరలు పెరిగాయి. ఇటీవల వ్యాపారులు మద్యం అమ్మకాలపై చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కమిషన్ 14.5 నుంచి 20 శాతం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.