ఈనెల 14న తెలంగాణ కాంగ్రెస్ కీలక మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్ లో రెండు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణలపై పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మీటింగ్ జరగబోతోంది. ఆ రోజు  మద్యాహ్నం 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాలపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు సమగ్ర సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.



ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జి ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరుకాబోతున్నారు. అలాగే మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కో-ఛైర్మన్, మంత్రి దామోదర్ రాజానర్సింహ హాజరుకానున్నారు. అలాగే  సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితోపాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.


ఇంకా  ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యవర్గ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.


ఈ మేరకు ఇప్పటికే  పీసీసీ అందరికీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనేలా డీసీసీ అధ్యక్షులు బాధ్యత తీస్కొని విజయవంతం చేయాలని పీసీసీ పిలుపునిచ్చింది. మరి ఈ మీటింగ్ లో కీలక నిర్ణయాలపై ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: