![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/songa-roshanf4da9f2e-7cb0-4b9e-bcd6-e2b7522df7a8-415x250.jpg)
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ చుట్టూ మూడు ముక్కలాట నడుస్తోంది. ఏలూరు జిల్లాలోనే ఈ ఏఎంసీ అత్యంత కీలకమైంది. తెలంగాణతో సరిహద్దులో ఉంది. ఈ పదవి కోసం చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నా ప్రధానంగా మూడు మండలాల నుంచి ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు. చింతలపూడి మండలం నుంచి సూరనేని గోపీ ( పట్టాయగూడెం గోపీ ) - కామవరపుకోట మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ ( గీతా సత్యనారాయణ ) తో పాటు ఎమ్మెల్యే సొంత మండలం లింగపాలెం నుంచి నందిగం సీతారాం తిలక్ ( బాబి ) ప్రధానంగా పోటీలో ఉన్నారు. ముగ్గురు పార్టీ కోసం ఎవరి స్దాయిలో వారు కష్టపడిన మాట నిజం. అయితే ఈ మూడు ముక్కలాటలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు బిగ్ సస్పెన్స్‌గా మారింది.
నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీ నుంచే రోషన్‌కు ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్యే సొంత మండలం నుంచి అతి తక్కువుగా కేవలం 900 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఇక పైన రేసులో ఉన్న ముగ్గురు నేతలు మూడు మండలాలకు చెందిన వారు. ఛైర్మన్ పదవి జనరల్ కేటగిరికి రిజర్వ్ కావడంతో పోటీలో ఉన్న ప్రధాన నేతలు ముగ్గురు కూడా ఓసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో గోపీ ఎమ్మెల్యేకు ఎన్నికలకు ముందు నుంచే భారీగా ఆర్థిక, ఇతరత్రా సాయాలు చేశారన్న ప్రచారం ఉంది. ఒకానొక దశలో ఆయన పేరే ప్రధానంగా రేసులో ఉన్నా... తర్వాత సామాజిక సమీకరణలతో పాటు కొన్ని అంశాలు ఆయనకు ఎంత వరకు కలిసోస్తాయన్నది చెప్పలేని పరిస్థితి.
ఇక కామవరపుకోట మండలాధ్యక్షుడిగా ఉన్న కిలారు సత్యనారాయణ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి మంచి ఊపు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందు నుంచే ఆయనకు గట్టి సపోర్టర్‌గా నిలబడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో కామవరపుకోట మండలం పార్టీకి మైనస్ అవుతుందన్న అంచనాలు పటాపంచలు చేస్తూ మంచి మెజార్టీ తీసుకువచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పనితీరు ఎమ్మెల్యేకు బాగా నచ్చుతోంది. కమ్మ వర్గానికి ఇవ్వాలనుకుంటే గీతాకు ప్లస్ అవుతుంది.
ఇక ఎమ్మెల్యే సొంత మండలం నుంచి బాబి రేసులో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బాబికి ఈ పదవి ఇస్తారా ? అన్న సందేహాలు ఉన్నాయి. అయితే ఓ ప్రజాప్రతినిధి సపోర్ట్‌తో బాబి పేరు బలంగా రేసులోకి వచ్చింది. బాబి కూడా కమ్మ వర్గానికే చెందిన నేత అయినా.. ఎమ్మెల్యే సొంత మండలానికే ఈ పదవి ఇస్తారా ? రెండు కీలక పదవులు ఒకే మండలానికా అన్న సందేహాలు ఉన్నాయి. అసలే ఈ మండలం నుంచి ఎమ్మెల్యేకు కేవలం 900 ఓట్ల మెజార్టీ వచ్చిందనుకుంటే.. ఏఎంసీ చైర్మన్ రేసులో ఉన్న వ్యక్తి ఊరు నుంచి పార్టీకి భారీగా మైనస్ ఓటింగ్ పడింది. దీనిపై కూడా పార్టీలో చర్చ నడుస్తోంది. ఏదేమైనా చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి ప్రధానంగా ఈ ముగ్గురు నేతల మధ్యే దోబూచులాడుతోంది.. మరి అంతమంగా ఎమ్మెల్యే ఎవరికి టిక్ పెట్టి ఏఎంసీ కుర్చీలో కూర్చో పెడతారో ? చూడాలి.