రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటాయో తెలియ‌దు. ఏ నిముషానికి ఏం జ‌రుగుతుందో ఊహించ‌డ‌మూ క‌ష్ట‌మే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కురాలు మాజీ మంత్రి రోజా సోద‌రుడు టీడీపీ కండువా క‌ప్పుకొంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, జ‌ర‌గ‌లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఆమెకు ఊహించని షాక్ ఎదుర‌వుతోంది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్ర‌కాష్ నాయుడు త‌మ్ముడు(గాలి ముద్దుకృష్ణ రెండో కుమారుడు) గాలి జ‌గ‌దీష్ నాయుడు వైసీపీలో చేరుతున్నారు.


దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. గాలి జ‌గ‌దీష్ నాయుడు మామ‌గారు.. వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న చేరిక సుల‌వైపోయింది. కాగా.. ఈ ప‌రిణామాలు.. రెండు ర‌కాలుగా రాజ‌కీయ షాకులు ఇస్తున్నాయి. 1) వైసీపీ నాయ‌కురాలు రోజాకు సెగ పెడుతుండ‌డం. ఎందుకంటే.. గాలి జ‌గ‌దీష్‌.. పార్టీలో చేర‌క‌ముందే.. గ‌త 2019 ఎన్నిక‌ల నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న నేరుగా పార్టీలోకి వ‌స్తున్నారు. దీంతో రోజా హ‌వాకు బ్రేకులు ప‌డే అవ‌కాశం ప‌క్కాగా క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.


ఇక‌, రెండో షాక్‌.. టీడీపీకి త‌గ‌ల‌నుంది. సొంత టీడీపీ నేత‌, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ రెడ్డి.. సోద‌రుడే పార్టీ మారి వైసీపీలోకి చేరుతున్నారంటే.. అది కూట‌మిని న‌డిపిస్తున్న టీడీపీకి కూడా ఇబ్బందే. ఇక ఈ విష యం వెలుగు చూడ‌గానే.. తిరుప‌తి జిల్లా టీడీపీ నాయ‌కులు అలెర్ట్ అయ్యారు. గాలి జ‌గ‌దీష్‌తో ర‌హ‌స్య మంత‌నా లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. కానీ, ఇప్ప‌టికే వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న‌కు బ‌ల‌మైన హామీ ల‌భించ‌డంతో జ‌గ‌దీష్‌.. చేరికే త‌రువాయి అంటున్నారు. అయినా.. టీడీపీ నేత‌లు మాత్రం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.


నామినేటెడ్ ప‌ద‌విని ఇచ్చేందుకు.. సుముఖంగా ఉన్న‌ట్టు హామీ ఇచ్చార‌ని తెలిసింది. అయితే.. ఈ విష యంలో జ‌గ‌దీష్ ఆలోచించి చెబుతాన‌ని చెబుతున్నారు. కానీ, వైసీపీ వైపు నుంచి కూడా ఒత్తిడి తీవ్రంగానే ఉంద‌ని స‌మాచారం. త‌మ పార్టీలోకి వ‌స్తే..ఏకంగా ఎమ్మెల్యే సీటు ఇస్తామ‌ని జ‌గ‌దీష్ కు పెద్ద నేత‌ల నుంచి హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న మొగ్గు వైసీపీ వైపే ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్థికంగా బలంగా ఉండ‌డంతో జ‌గ‌దీష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: