పల్లె, బస్తీ దవాఖానలు ప్రారంభించి ప్రజల సుస్తీని బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొడితే... ఆ దవాఖానాలకే సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీమంత్రి హరీశ్ రావు  అన్నారు. పట్టణ పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దవాఖానాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమొక్కు లేక మూతబడటం దురదృష్టకరమని మాజీమంత్రి హరీశ్ రావు  ఆవేదన వ్యక్తం చేశారు.


14 నెలలు గడుస్తున్నా వైద్య,ఆరోగ్య శాఖ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం, వైద్యాధికారుల అలసత్వం... పేద ప్రజలకు శాపంగా మారుతోందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాల్సిన బస్తీ దవాఖానలు మధ్యాహ్నం వరకే మూతబడుతున్నాయని... వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని హరీశ్ రావు అన్నారు. ఆదివారం బస్తీ దవాఖానలు సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, వైద్య సిబ్బంది రాకపోవడంతో దవాఖానాలు తాళం వేసి ఉంటున్నాయని హరీశ్ రావు తెలిపారు.


టీడయాగ్నోస్టిక్ ద్వారా బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు టెస్టులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. బస్తీ దవాఖానల్లో మందుల కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ ఔషధాల జరగడం లేదని హరీశ్ రావు అన్నారు. సిబ్బంది కొరత వేధిస్తుండగా, వేతనాలు సకాలంలో అందక వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యల వలయంలో బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కొట్టుమిట్టాడుతుంటే, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు.


ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, వైద్య-ఆరోగ్యశాఖా మంత్రి ఇప్పటికైనా పల్లె, బస్తీ దవాఖాన, తెలంగాణ డయాగ్నొస్టిక్ సమస్యలు పరిష్కరించి... పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కేసీఆర్ పదేళ్లలో తెలంగాణ వైద్య,ఆరోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్ గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తోందని ఆయన ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర వెల్నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: