తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ రంగంలో హైదరాబాద్ పాత్రను మరింతగా మెరుగుపరుస్తున్నారు. నిన్న ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మైక్రో సాఫ్ట్, గూగుల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని సంచలనం సృష్టించారు. భవిష్యత్‌ అంతా కృత్రిమ మేథపైనే ఆధారపడి ఉంటుందని... హైదరాబాద్‌ను కృత్రిమ మేథ కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలీలో మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి  ప్రారంభించారు.


హైదరాబాద్ ఐటీ ప్రయాణంలో మైక్రోసాఫ్ట్ నూతన కార్యాలయం ఏర్పాటు మరో మైలురాయి వంటిదని రేవంత్ రెడ్డి తెలిపారు. మైక్రోసాఫ్ట్‌కు, హైదరాబాద్‌కు మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని.... మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇక్కడి నుంచే ప్రపంచస్థాయిలో ప్రభావాన్ని చూపించే స్థాయికి ఎదిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్త కార్యాలయం ఏర్పాటు వల్ల మరింత మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఇప్పటికే 500 ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేథపై బోధిస్తున్నట్లు తెలిపారు.


హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.  మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు మూసీ పునరుజ్జీవన పథకం ద్వారా హైదరాబాద్‌ సుస్థిరాభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దృఢ సంకల్పంతో ముందుకెల్తున్నామని శ్రీధర్ బాబు చెప్పారు.


రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఏఐ సిటీలో కృత్రిమ మేథ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్‌ ఎంఓయూ కుదుర్చుకుంది. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏఐ కేంద్రం ఏర్పాటుకు గూగుల్‌ సైతం ముందుకు వచ్చింది. ఈ మేరకు టీహబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గూగుల్ ప్రతినిధులు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యవసాయం, విద్య, రవాణా రంగం, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు గూగుల్ ఏఐ కేంద్రం తోడ్పాటునందించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

it