
పోలీసుల నోటీసులకు పూర్తి వివరణ ఇస్తానని, విచారణకు సహకరిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జరిగిన ఘటన, పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఆయన వివరణ ఇస్తూ ప్రకటన జారీ చేశారు. 2018లో తాను కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలను మేనల్లుడు జ్ఞాన్‌దేవ్ రెడ్డి చూసుకుంటున్నారనిఎమ్మెల్సీ పోచంపల్లి అన్నారు. అక్కడ ఎటువంటి ఫార్మ్ హౌస్, గెస్ట్ హౌస్ లేదని... కేవలం మామిడి, కొబ్బరి తోట, పనివారి కోసం రెండు గదులు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు.
తన ప్రమేయం లేకుండానే తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు నిన్నటి సంఘటన తర్వాత జ్ఞాన్‌దేవ్ రెడ్డి నుంచి తెలిసిందని పోచంపల్లి చెప్పారు. వర్రా రమేష్ కుమార్ రెడ్డి కూడా ఆ తోటను ఎం.వెంకటపతి రాజుకు కౌలుకు ఇచ్చారని... నిన్నటివరకు ఈ విషయం కూడా తన దృష్టికి రాలేదని ఎమ్మెల్సీ పోచంపల్లి వివరించారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.
మీడియాలో వస్తున్నట్లు ఆ తోటలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఉంటే వాటికి... తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి స్పష్టం చేశారు. సంఘటన జరిగిన రోజు తాను హైదరాబాద్ లో లేనని, వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో ఉన్నట్లు పోచంపల్లి తెలిపారు. కేవలం రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే కొందరు దుష్ప్రచారం మొదలుపెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి ఆక్షేపించారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క చిన్న కేసు కూడా లేకుండా ప్రజా సేవకే అంకితమయ్యానని... చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని ఎమ్మెల్సీ పోచంపల్లి అన్నారు.