![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/tdpc33f6bf1-aac1-4e67-92f5-4bd0f651c57f-415x250.jpg)
తిరుపతి ఇష్యూ కావొచ్చు తిరుమల ఇష్యూ కావొచ్చు.. పోలీసు వ్యవస్థ కావొచ్చు... పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. సంచలనం రేపాయి. మీడియాలోనూ ఇవి బాగా హైలెట్ అయ్యాయి. దీంతో పవన్ డామినేషన్ ఎక్కువగా ఉందన్న చర్చ సాగుతోంది. ఇదేసమయంలో ప్రస్తుతం టీడీపీలో నెంబర్ 2గా ఉన్న నారా లోకేష్ పుంజుకునే అవకాశం ఉన్నా.. కారణాలు ఏవైనా.. ఆయన పవన్‌తో పోల్చుకుంటే కొంత వెనుకబడుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఈ పరిణామాలతోనే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే.. గ్రౌండ్ లెవిల్ ముచ్చట ఎలా ఉన్నప్పటికీ.. పై స్థాయిలో చూసుకుంటే.. పవన్ కల్యాణ్ పట్ల నారా లోకేష్ గౌరవంగానే కనిపిస్తున్నారు. ఇక, నారా లోకేష్ విషయంలో పవన్ ఎప్పుడూ స్పందించింది లేదు. ఆయన శాఖలో వేలు పెట్టింది కూడా లేదు. ఇంకా.. హోం శాఖపై ఆయన విమర్శలు చేశారు తప్ప.. విద్యాశాఖపై మాత్రం పవన్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు. దీంతో పైస్థాయిలో అందరూ బాగానే ఉన్నట్టుకనిపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఎందుకిలా..?
ఈ విషయంలో జనసేన వర్గాల టాక్ ఒక విధంగా ఉంటే.. టీడీపీ నాయకుల మాట మరో విధంగా ఉంది. కూటమి ఏర్పాటుకు రాష్ట్రంలో వైసీపీ సర్కారును దించేసేందుకు కీలకం.. తమ నాయకుడేనని జనసేన వర్గాలు ఆది నుంచి చెబుతున్నాయి. కానీ, తమ నాయకుడు చేసిన పాదయాత్ర ఫలితంగానే వైసీపీ సర్కారుకుప్పకూలిందన్నది టీడీపీ కార్యకర్తలు, నాయకుల గ్రౌండ్ టాక్. ఇదే.. ఈ రెండు పార్టీల నాయకుల మధ్య విభేదాలు పెంచుతోంది. అయితే.. పైస్థాయిలో ఎవరూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఉమ్మడిగానే ఉంటుందని నారా లోకేష్ చెబుతున్నారు. దీనిని బట్టి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం కేవలం కల్పితమేనన్నది మరికొందరి వాదన. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న చర్చ మాత్రం జోరుగానే సాగుతోంది.