కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో గత‌ రెండున్నర దశాబ్దాలు గా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రారంభించిన వంశీ .. 2009లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికలలో వంశీ విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి.. లగడపాటి రాజగోపాల్ చేతిలో కేవలం 13 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం 2014 ఎన్నికల నాటికి వంశీ గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి.. దుట్టా రామచంద్ర రావు పై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.


2019 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా జగన్ గాలివీచి వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినం గన్నవరంలో మాత్రం వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వంశీ రెండోసారి ఎన్నికలలో కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో నెగ్గిన‌ అనంతరం తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన వంశీ.. వైసీపీకి దగ్గరయ్యారు. తాజాగా వంశీని వివిధ కేసులలో పోలీసులు అరెస్టు చేశారు. అసలు మొన్న ఎన్నికల్లోనే వంశీకి పోటీ చేసేందుకు ఎంత మాత్రం ఆసక్తి లేదన్న ప్రచారం జరిగింది. ఈ ఎన్నిక‌ల్లో త‌న పాత ప్ర‌త్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు చేతిలో వంశీ ఓడిపోయారు.


ఓట‌మి తర్వాత ఆయన.. రాజకీయాలకు గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజా పరిణామాలు నేపథ్యంలో వంశీ గన్నవరం రాజకీయాలకు దూరంగా ఉంటారని వైసీపీ వర్గాల ప్రచారం జరుగుతోంది. గన్నవరంలో రాజకీయం చేసేందుకు వంశీ ఆసక్తితో లేరని అంటున్నారు. అదే జరిగితే జగన్ గన్నవరంలో వైసీపీ తరఫున మరో కొత్త నేతకు పగ్గాలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. మరి వంశీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: