రేవంత్ రెడ్డి ఇటీవల మోడీ కులంపై చేసిన వ్యాఖ్యల దుమారు కొనసాగుతోంది. మోడీ కులంపై రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తే.. రాహుల్ గాంధీ మతం అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇందుకు కొనసాగింపుగా తాజాగా మంత్రి సీతక్క కామెంట్ చేశారు. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేసి.. ఆయన మతంపై చర్చ సృష్టిస్తున్నారని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు.


దేశవ్యాప్తంగా కులగణన చేసి  జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమని మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర మంత్రయిన బండి సంజయ్ రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.  


బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కుల గణన కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ.. ముప్ఫై ఏళ్లుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో..కాంగ్రెస్ శాంతి- సమానత్వం- అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.


బీజేపీ పదేళ్లుగా దేశానికి.. పేదల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని మంత్రి సీతక్క అన్నారు. విభజన రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నేతల నైజం కాదన్నారు. అదాని ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయటం లేదన్న సీతక్క... అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యమని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: