
టెలీమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలీమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జలసంఘంపైనే ఉందని... నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా నీటిని తరలించే విషయమై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం నీరు విడుదల చేయాలని.. రానున్న మూడు నెలలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగు నీటి విడుదలపై నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో పోలిస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగు నీటికి తాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలనిఅధికారులను అప్రమత్తం చేశారు.