
గత ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పులమయం అయిందని.. రాష్ట్రం మరో శ్రీలంకలా దివాళా తీస్తోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ పదే పదే ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి శాఖపై అసెంబ్లీ వేదికగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ వస్తోంది. ఇప్పుడు హామీలు అమలు చేయాలని ఉన్నా జగన్ నిర్వాకం వల్ల హామీలు అమలు చేయలేకపోతున్నామని వైసీపీ మీద నెట్టేస్తున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేసింది. ఇక అధికారంలోకి వచ్చాక ఆ లెక్కను కాస్త సవరించి చూపించింది. శ్వేతపత్రాల ద్వారా వెల్లడించిన అప్పుల మొత్తం తక్కువగా ఉండటంతో వైసీపీ ప్రతిదాడికి దిగింది. అయితే తాజాగా మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన లెక్కలు మరింత ఆసక్తికరంగా మారాయి.
రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన వైసీపీ అన్నిరకాలుగా భ్రష్టుపట్టించిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు.. వైసీపీ అప్పులపై తనదైన స్టైల్ లో లెక్కలు బయటపెట్టారు. ఏపీని పాలించిన ముఖ్యమంత్రులు అందరూ కలిపి 58 ఏళ్లలో చేసిన అప్పులకు రూ.14,155 కోట్లు వడ్డీగా చెల్లించేవారమని చెప్పిన లోకేశ్.. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వల్ల వడ్డీ మొత్తం రూ.24,944 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీకంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే దాదాపు రూ.11 వేల కోట్లు ఉందని లోకేశ్ చెప్పడం వైరల్ అవుతోంది.
తెచ్చిన అప్పులలో మూలధన వ్యయం తక్కువగా ఉండటం వల్ల సంపదను సృష్టించలేకపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి అప్పులు చేయడమే కాకుండా, తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వైసీసీ విమర్శించడాన్ని ముఖ్యమంత్రి తప్పుబడుతున్నారు. రెండు రోజుల క్రితం గల్లపెట్టి ఖాళీ అంటూ సీఎం తన నిస్సహాయతను వ్యక్తం చేయగా, తాజాగా మంత్రి లోకేశ్ 58 ఏళ్ల పాటు పాలించిన ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఐదేళ్లలో వైసీపీ చేసిన అప్పులకు మధ్య తేడాను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.