వైసీపీ పరిస్థితి గురించి చెప్పాలంటే ఎన్నికల ముందు.. తర్వాత అని చెప్పుకోవచ్చు.  2014 ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి పాలైనా  ఇప్పుడు మాదిరి పార్టీ నేతలు ఎవరూ జగన్ ని వీడిపోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.   ముఖ్యులు, జగన్ వెంట ఆది నుంచి నడిచిన నేతలు,  సన్నిహితులు ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. అయినా జగన్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.  రాబోయేది మన ప్రభుత్వమేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  


ఇక విశాఖ సౌత్ నుంచి ఒకనాడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు అంతా జారుకుంటున్నారు.  మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పక్క చూపులు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.  బీజేపీలోకి వెళ్తారు అని అంటున్నారు. ఆయన టీడీపీ నుంచి 2014, 2019లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆ పార్టీలోకి వచ్చారు. 2024 లో టికెట్ సాధించారు. కానీ గెలవలేకపోయారు.


ఆయన తిరిగి టీడీపీలో చేరాలని చూసినా కుదరక పోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.  ఇక బీజేపీ సైతం  ఏపీలో బలపడాలని చూస్తోంది. ఈ క్రమంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు, బడా వైసీపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.   వైసీపీ హయాంలో కార్పోరేటర్లుగా గెలిచిన వారు కీలక నామినేటెడ్ పదవులు అందుకున్న వారు కూడా జనసేనలో చేరిపోతున్నారు.  తాజాగా ప్రఖ్యాత కనకమహాలక్ష్మి దేవాలయం చైర్ పర్సన్ గా చేసిన సీనియర్ నాయకురాలు ఒకరు జనసేన కండువా కప్పుకున్నారు.  ఆలాగే కార్పోరేటర్లు కొందరు పార్టీ మారారు.


ఇక ఇలా వైసీపీకి చెందిన కీలక నేతలను జనసేన, బీజేపీలు పోటీ పడి మరీ చేర్చుకుంటున్నాయి. ఇక వైసీపీ నేతల విషయంలో టీడీపీ సంయమనం పాటిస్తూ వస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా తమని ఇబ్బందులకు గురి చేశారని వారిని పార్టీలో చేర్చుకోవద్దని క్యాడర్ కు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. దీంతో వీరంతా పక్క చూపులు చూసే క్రమంలో బీజేపీ, జనసేనలు వారికి చక్కని వేదికలుగా మారుతున్నాయి. మరి వీటిని జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: