దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ సర్వేలో 97శాతం ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకున్నారని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వే లెక్కలు తప్పుల తడక అని విమర్శించడం సబబుకాదన్నారు.  ఏ రాష్ట్రములో నిర్వహించని విధంగా 94, 863  ఎన్యుమరేటర్స్ , 9 ,628 సూపర్ వైజర్స్ , 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు ద్వారా కేవలం 50  రోజుల్లో ఈ సర్వేను నిర్వహించారని వివరించిన చైర్మన్‌...ప్రభుత్వం చేసిన కృషిని ఏ పార్టీ వారైనా అభినందించాలని తెలిపారు.


రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. 3 లక్షల కుటుంబాలు సర్వే అధికారులకు వివరాలు ఇవ్వలేదని..వారు తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డ్స్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారని... ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని స్పష్టం చేశారు.


అలాగే  BPL, APL  కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. దీనికి  సీఎం సానుకూలంగా స్పందించారని BPL, APL కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించడం వలన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయన్నారు.


కేవలం 25000 ఓట్ల ఎన్నిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమలు చేయడం వలన నష్టం జరుగుతుందని... కోడ్ ని సవరించాలని ఈ. సి.ఐ కి కూడా లేఖ రాసినట్లు వివరించారు. సేద్యము చేసే భూములన్నీకి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం...అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: