రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ సర్కారు ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారు సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లిపోవచ్చని తెలిపింది. అలాగే రంజాన్ మాసంలో  అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులకు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్అండ్‌బీ తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.


పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య, వీధిదీపాలు, రోడ్ల నిర్వహణ, దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి వివరించారు. మసీదులు, ఈద్గాల వద్ద తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి ప్యాకెట్లు, ట్యాంకర్లు ఏర్పాటు చేయనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.


రంజాన్ నెలలో మసీదుల వద్ద మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు. మసీదుల వద్ద టెంట్లు, క్యూలైన్ బారికేడ్లు, ఏర్పాటు చేయనున్నట్లు ఆర్అండ్ బి శాఖ పేర్కొంది. అవసరాలకు తగిన పాలను సరఫరా చేయనున్నట్లు డెయిరీ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వరకు వీధి వ్యాపారాలు కొనసాగించడానికి అనుమతించాలని.. ట్రాఫిక్ పేరుతో ఇబ్బంది కలిగించవద్దని పోలీస్ అధికారులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు.


మసీదులు, ఈద్గాల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సమయానికి రేషన్ అందేలా అధికారులు పౌరసరఫరాల శాఖను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సమావేశంలో  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: