
ఏపీ ఆశా కిరణం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కితాబు ఇచ్చారు. ఏపీకి సంబంధించి ఏమి చేయాలన్నా కేంద్రంతో మాట్లాడి ఏపీకి న్యాయం చేయాలన్నా అది పవన్ ఒక్కడికే సాధ్యం అని అన్నారు. ఇదిలా ఉండగా ఉండవల్లి చుట్టూ కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన వైసీపీ లో చేరతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే ఉండవల్లి పవన్ ని ఇంతలా పొగుడుతూ కామెంట్స్ చేయడానికి కారణం ఉంది. ఏపీ విభజన హామీలు దశాబ్దాల కాలం గడచినా నెరవేరడం లేదు. జగన్, చంద్రబాబు ఏలుబడిలో కేంద్రం నుంచి విభజన హామీలు సాధించడంలో విఫలం అయ్యారని ఉండవల్లి అంటున్నారు. దాంతో ఇక పవన్ మాత్రమే రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటూ ఆయన కితాబు ఇచ్చారు. ఏపీలో కూటమి సారధిగా ఉన్న చంద్రబాబు కంటే అలాగే విపక్షంలో ఉన్న జగన్ కంటే పవన్ చాలా బెటర్ అని ఉండవల్లి ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు.
ఏపీకి విభజన హామీలు నూరు శాతం సాధించే సత్తా పవన్ ఒక్కడికే ఉందని ఆయన అన్నారు. ఆ దిశగా పవన్ కృషి చేయాలని కోరుకుంటున్నట్లుగా ఉండవల్లి చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీలోని రాజకీయ పార్టీల మీద ఆధారపడి నడుస్తోందని ఉండవల్లి అన్నారు. సమయంలోనే విభజన హామీలను సాధించుకోవాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో ఎంత చేయాలో అంత చేయాలని కేంద్రం మీద ఒత్తిడి తీవ్రంగా పెట్టాలని ఆయన కోరారు.
కేంద్రం, బీజేపీ పెద్దల వద్ద ఎంతో పలుకుబడి ఉన్న పవన్ మాత్రమే ఏపీకి విభజన హామీలు అన్నీ సాధించగలరని ఆయన అన్నారు. ఆ నమ్మకం తనకు పూర్తిగా ఉందని చెప్పారు. దీని కోసం ఆయన లోక్ సభలో నోటీసు ఇవ్వాలని చెప్పారు. ఆ నోటీసు ఎలా ఇవ్వాలో కూడా తాను లేఖలో వివరించాను అని ఉండవల్లి చెప్పారు తనకు పవన్ మీద ఈ విషయంలో నమ్మకంతో పాటు ఆశ కూడా ఉందని అన్నారు. మొత్తానికి పవన్ ని పొగుడుతూనే పెద్ద భారమే పెట్టారు ఉండవల్లి.