![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/maskd87b930a-2ea5-44da-8ac8-6411a88a3f10-415x250.jpg)
అంతర్జాతీయంగా టెస్లా కార్లతో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. అతి పెద్ద ఆటో మొబైల్ వినియోగదారులు ఉన్న భారత్ లో అడుగుపెట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఇన్నాళ్లూ చిన్న నిబంధనతో కాలు పెట్టలేకపోయింది. ఇప్పుడు మాత్రం లైన్ క్లియర్ అయింది.
టెస్లా.. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ. ఈ కారు మామూలుగా ఉండదు. కానీ, అతి పెద్దదైన భారత మార్కెట్లోకి మాత్రం రాలేదు. 2021 నుంచి ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కాలేదు. కారణం.. ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలనేది టెస్లా డిమాండ్. దీనికి కేంద్ర ప్రభుత్వం షరతులు అడ్డొస్తున్నాయి. భారత్ లో తయారీ ప్లాంట్, ఇక్కడే విడిభాగాలు కొనుగోలు చేయాలనే నిబంధనలు పెట్టింది. ఇందుకు మస్క్ ఒప్పుకోకపోవడంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వస్తోంది.
అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం 40 వేల డాలర్ల (రూ.34 లక్షలు) కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. దీంతో టెస్లా భారత్ లోకి వచ్చేందుకు కాస్త రూట్ ఏర్పడింది. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో మస్క్ భేటీలో టారిఫ్ ల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో భారత రోడ్లపై టెస్లా కార్లు కనిపించే చాన్సుందనే ప్రచారం జరుగుతోంది
మోదీ-మస్క్ భేటీ అయిన కొద్ది రోజులకే భారత్ లో సిబ్బంది నియామకానికి టెస్లా నోటిఫికేషన్ ఇచ్చింది. కస్టమర్ రిలేటెడ్, బ్యాక్ ఎండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ లింక్డిన్‌లో ప్రకటన చేసింది. సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ సహా కనీసం ఐదు పొజిషన్లకు ఉద్యోగులను ముంబై, ఢిల్లీలో, కస్టమర్ ఎంగేజ్ మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను ముంబైలో నియమించనుంది. దీంతో మరికొన్నాళ్లలో భారత్ రోడ్లపై టెస్లా కార్లు రయ్ మనేందుకు సిద్ధమవుతున్నాయనే అంచనాలు పెరిగిపోతున్నాయి.