
పదేళ్ల కేసీఆర్ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపేశారు. తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రేషన్ కార్డుల్ని జారీ చేస్తానని చెప్పిన రేవంత్.. అందుకు తగ్గట్లే కొత్త రేషన్ కార్డుల్ని ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మీ సేవా సెంటర్లలో అప్లై చేసుకోవచ్చని చెప్పటం.. ఆ తర్వాత మీ సేవలో రేషన్ కార్డుల నమోదుకు ఇబ్బందులు ఏర్పడటం లాంటివి జరుగుతున్నాయి.
దీనిపై ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు మార్లు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం మరో సారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పైగా ఇది నిరంతర ప్రక్రియ అని చెబుతున్నా గ్రామీణ ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. పదేళ్లు రేషన్ కార్డులు జారీ చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే.. కార్డులు ఇచ్చేందుకు ఓకే చెప్పి.. ఆ ప్రాసెస్ లో చోటు చేసుకున్న లోటుపాట్లు కారణంగా రేవంత్ సర్కారు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి రేషన్ కార్డులు ఒక్కటే కాదు.. రైతు భరోసా.. రైతు రుణమాఫీ ఇలా ప్రతి అంశంలోనూ ఆశించినంత మైలేజీ రాకపోగా.. ప్రభుత్వ పని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ కార్డుల వ్యవహారాన్నే తీసుకుంటే.. రేషన్ కార్డుల జారీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా నిలుస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించకపోవటం.. వారిని అధికారులు అలెర్టు చేయకపోవటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందనే భావన వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో .. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే రేషన్ కార్డుల జారీని చేపట్టాలని ఆదేశించారు. మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం భారీ క్యూలైన్లు ఎందుకు? అన్న ముఖ్యమంత్రి ప్రశ్నకు అధికారులు సమాధానం ఇచ్చారు. రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయని.. వెంటనే రేషన్ కార్డుల్ని జారీ చేస్తే.. ఇందుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. దీంతో.. వేగంగా కార్డుల జారీకి ఓకే చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొత్త కార్డుల జారీకి పలు డిజైన్లను పరిశీలించిన ఆయన.. ఒక డిజైన్ కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.