
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు జగన్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని ఎత్తి చూపుపతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై డేగకన్నుతో ఉంటామని.. ఎవ్వరూ అవినీతి చేయకుండా.. తమ ప్రభుత్వంలో ఆ పదానికి ఆస్కారం లేకుండా చేస్తామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు... అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నెల రోజుల నుంచే అవినీతి విలయతాండవం చేయిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చాలా నయం అన్నట్టుగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఉంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన ప్రాబల్యం ఉన్న చోట గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే చేస్తోన్న అవినీతిని చూసి నియోజకవర్గ జనాలే కాదు... సాక్షాత్తూ టీడీపీ కేడర్ బెంబేలెత్తిపోతోంది. హవ్వ.. ఇలాంటోడినా మనం ఎమ్మెల్యేగా గెలిపించింది... ఇలాంటోడి కోసమా.. మనం అంతా కష్టపడి గెలిపించిందని నెత్తినోరు బాదుకుంటున్నారు.
** ఆ నియోజకవర్గంలో కొన్నేళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో సదరు ఎమ్మెల్యే దాయాది పార్టీ కోసం ఆర్థికంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి... స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బతికిస్తే.. ఆయనను కాదని.. ఈ నేతకు టిక్కెట్ ఇచ్చారు. అప్పుడు ఈ నేతకు టిక్కెట్ కోసం పట్టుబట్టిన వారందరిని అణగదొక్కుతూ తన అవినీతి చాపలు పేర్చుకుంటూ.. కాలనాగులా బుసలు కొడుతూ వెళుతున్నారు సదరు ఎమ్మెల్యే.
** తన గెలుపుకోసం ఎంతో కష్టపడిన మాజీ ప్రజాప్రతినిధిని... ఆయన వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పార్టీని నిలబెట్టిన ఎమ్మెల్యే దాయాది వర్గం నాయకులను దూరం పెట్టడం.. మరి కొంత మంది తెలుగుదేశం నాయకుల మీద వేధింపులతో పాటు పోలీసు కేసులు... అక్రమ కేసులు.. గంజాయి కేసులు పెట్టిస్తామని బెదిరించడం చేస్తున్న పరిస్థితి.
** నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టేసి వారికి ఎలాంటి పదవులు లేకుండా చేయడంతో పాటు ప్రతి పదవికి ఒక రేటు ఫిక్స్ చేసి.. ఆ డబ్బు కట్టిన వాళ్లకే పదవులు ఇస్తానని బహిరంగ వేలంలా మార్చేశాడు సదరు ఎమ్మెల్యే. ఇంతకన్నా దారుణం ఏంటంటే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవుల్లో పెద్దపీఠ వేస్తోన్నారు.
** ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గానికే చెందిన ఓ నేత పొగాకు, కాంట్రాక్టు పనుల్లో ఆరితేరాడు. ఎమ్మెల్యే అతడిని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులను కంట్రోల్ చేస్తూ పలు రకాల అక్రమ వ్యవహారాల్లో ఎమ్మెల్యేకు సలహాలు ఇస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. నియోజకవర్గ కేంద్రం ఉన్న మండలం అక్రమ వసూళ్లు మొత్తం ఇతడి చేతుల్లో పెట్టేశాడు ఎమ్మెల్యే.
** మరో మండలంలో వసూళ్ల దందాను ఎమ్మెల్యే బావమరిదికి అప్పగించగా అతడిపై మండల పార్టీ కేడర్‌లో తీవ్రమైన అసంతృప్తి రావడంతో ఎమ్మెల్యే తన బావమరిదిని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం.
** నియోజకవర్గంలో రేషన్ మాఫియాను నడిపించేందుకు ఎమ్మెల్యే ఓ వ్యక్తిని నియమించుకోగా.. సదరు వ్యక్తి తన రైస్‌మిల్‌లో రేషన్ బియ్యం స్టోర్ చేసి మరో వ్యక్తితో కలిసి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు గాను ఎమ్మెల్యేకు నెలకు రు. 27 లక్షల మామూలు ముడుతున్నాయట.
** ఇక అక్రమ ఇసుక తవ్వకాల కోసం ఓ నేతను పెట్టుకుని అతడి ద్వారా అధికారులను మేనేజ్ చేస్తూ మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు సదరు ఎమ్మెల్యే. అక్రమ ఇసుకను ఓ బ్రిడ్జి దగ్గర స్థలంలో డంప్ చేసి అక్కడ నుంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారు.
** ఇక నియోజకవర్గ కేంద్రంలో ఓ తెలుగు యువత నాయకుడు నేరుగా ఎమ్మెల్యే పేరు చెప్పి పలు రకాల వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే మనిషిని తెలుసు కదా.. తేడా వస్తే ఏం జరుగుతుందో అని కాంట్రాక్టర్లను బెదిరించి మరీ కప్పం వసూలు చేసుకుంటున్నాడు. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎమ్మెల్యేకు వెళ్లిపోతోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లు మాట్లాడినా బెదిరించడంతో పాటు కేసులు పెడతామని భయపెడుతున్న పరిస్థితి.
** ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలోనే ఎమ్మెల్యే లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పి వారం రోజుల ఉపాధి కూలీల వేతనంలో రు. 100 వసూలు చేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
** ఇక రేషన్ డీలర్ల విషయంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వారి నుంచి లక్ష రూపాయలు తీసుకుని రేషన్ డీలర్ ఎమ్మెల్యే ఇస్తోన్న పరిస్థితి.
** వెలుగు డిపార్ట్‌మెంట్‌లో ఉండే యానిమేటర్ పోస్టుకు ఎమ్మెల్యే స్వయంగా రు. 50 వేలు వసూలు చేస్తోన్న పరిస్థితి.
** నియోజకవర్గం మధ్యలోనుంచి వెళుతోన్న ఓ బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే సామాజిక వర్గానికే చెందిన అమరావతి ఏరియాకు చెందిన ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యే రు. 5 కోట్లు డిమాండ్ చేయగా.. ఆ కాంట్రాక్టర్ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో పనులు నిలిపివేస్తామని బెదిరించడంతో కాంట్రాక్టర్ స్వయంగా సీఎం స్థాయిలో తన పలుకుబడి ఉపయోగించి పనులు తిరిగి మొదలు పెట్టారు.
** జామాయిల్ తోటలను ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన చెంచాగా ఉండే ఎమ్మెల్యే సొంత వర్గానికే చెందిన ఓ వ్యక్తి నరికిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు.
** నియోజకవర్గంలో సంక్రాంతి నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ పేకాటతో పాటు రకరకాల ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇందుకు గాను ఎమ్మెల్యేకు రు. 70 లక్షలు ముట్టాయట.
** ఇక గవర్నమెంట్ హాస్పటల్ నుంచి డాక్టర్లు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తే ఎమ్మెల్యే పేరు చెప్పి ఓ అనుచరుడు ప్రతి సర్టిఫికెట్ కు 3,000 రూపాయలు చొప్పున తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక లిక్కర్ షాపుల సిండికేట్లో 20 % వాటా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
** నియోజకవర్గంలో ప్రతి కాంట్రాక్టులో లక్షకు పదివేలు ఎమ్మెల్యే వాటా ఇవ్వాలని ఆయన ప్రధాన అనుచరుడు దందా చేస్తోన్న పరిస్థితి.
** ఇక ఔట్ సోర్సింగ్ సిబ్బంది స్థాయిని బట్టి డబ్బులు గుంజుతున్నారు. డబ్బులు ఇవ్వని వారిని నిర్దాక్షిణంగా తొలగించి డబ్బులు తీసుకుని కొత్తవాళ్లకు ఆ పోస్టులు ఇస్తున్నారు. చివరకు ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ స్వీపర్లను వదలకుండా ఒక్కొక్కరి నుంచి రు.50 వేలు లాగుతున్నారు.
** నియోజకవర్గంలో ఉన్న ఓ ప్రముఖ దేవస్థానంలో ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తప్పించి వారి స్థానంలో 40 మంది కొత్త వారిని తీసుకుని.. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 - 3 లక్షల వరకు వసూళ్లు చేశారు. దీనిపై తొలగించిన ఉద్యోగులు సదరు శాఖా మంత్రిని కలిసి వినతిపత్రం ఇస్తే ఆయన సైతం ఇంత దారుణమా ? అని నోరెళ్ల బెట్టి నేనేం చేయలేను.. నారా లోకేష్‌ను కలవమని చెప్పిన పరిస్థితి ఉందట.
** ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ కమ్మ సామాజిక వర్గ మాజీ ప్రజాప్రతినిధి పేకాట శిబిరాలు నడుపుతూ కేబుల్ తీసి ఎమ్మెల్యేకు వాటా ఇస్తోన్నాడని టాక్ ?
** ఇక ఓ ప్రముఖ దినపత్రిక విలేఖరితో పాటు మరో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ ఇద్దరూ ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉంటూ రకరకాల అవినీతి.. అక్రమాలకు పాల్పడుతున్నారని లోకల్ టాక్ ?
ఏదేమైనా చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన దానికి.. ఇలాంటి అవినీతిపరులు అయిన ఎమ్మెల్యేలు చేస్తోన్న దానికి ఏ మాత్రం పొంతన లేదు.. అసలే ఆ నియోజకవర్గంలో చాలా యేళ్ల తర్వాత పార్టీ జెండా ఎగిరింది.. చంద్రబాబు ఆ ఎమ్మెల్యేను కంట్రోల్ చేయకపోతే పార్టీ మరో నాలుగేళ్ల దాకా అక్కర్లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలనాటికే బొక్క బోర్లా పడడం ఖాయం.