వేసవి పూర్తిగా రాకముందే.. తెలంగాణలో కరెంట్ డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో ఎన్నడూ లేనట్లుగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో ఈ సీజన్ లో భారీగా విద్యుత్ డిమాండ్ నమోదవుతుంది. ఇటీవలి కాలంలో 10 వేల మెగావాట్లకు మించి గరిష్ట డిమాండ్ రికార్డ్ అవుతోంది.  ఈ నెల 7వ తేదీన 10,130 మెగావాట్ల రికార్డు పీక్ డిమాండ్ నమోదైంది.


నిన్న 10,049 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదయ్యింది. వినియోగం సైతం 200 మిలియన్ యూనిట్లు గా నమోదవుతుంది. ఫిబ్రవరి 18వ తేదీన 202.18 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన 9,910 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదు అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన 198.80 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి వినియోగం జరిగింది.


గతంలో సెప్టెంబర్ నెలలో మాత్రమే నమోదయ్యే రికార్డు స్థాయి డిమాండ్, వినియోగాలు ఈ ఏడాది ఫిబ్రవరి లోనే రికార్డు అవుతున్నాయి. ఈ సీజన్ లో తాము ఆశించినట్లుగానే డిమాండ్, వినియోగాలు నమోదవుతున్నాయని, యాసంగి సీజన్, సమ్మర్ సీజన్ ప్రభావం వలన రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశమున్నదని ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనావేస్తున్నారు. ఈ అదనపు డిమాండ్ లు తట్టుకునేందుకు, నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన వంటి పనులు చేపట్టినట్లు ఎస్పీడీసీఎల్ తెలిపింది.


గత ఏడాది ఫిబ్రవరిలో 8,803 మెగావాట్లు, ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన 9,772 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయ్యింది. గత ఏడాదితో పోల్చితే...ఈ ఏడాది అదనంగా 11.01 శాతం అదనపు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో గత ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా 14,231 డిమాండ్ ఏర్పడితే...ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన అత్యధికంగా 15,600 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే..రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 9.62శాతం పెరిగినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: