ఏపీ తమ నీళ్లు దోచుకుంటోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. నాగార్జున సాగర్‌, శ్రీశైలం నీటిని రబీ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా వినియోగిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌ ఉదయపూర్‌లో జరుగుతున్న రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.


తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆంధ్రప్రదేశ్‌ నీటి తరలింపును అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రమంత్రిని డిమాండ్‌ చేశారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం నీళ్ల వాడకంపై 35చోట్ల టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ నీటి సమస్యలు, ఏపీ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని, కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు  వేగంగా లభించేలా చూస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్ గట్టి హామీ ఇచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.


ఇరురాష్ట్రాల మధ్య ఒప్పందానికి విరుద్ధంగా సాగర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువగా నీటిని డ్రా చేస్తున్న విషయాన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించినట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు.  సాగర్‌ ఆయకట్టు పరిధిలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రబీ పంటను కాపాడేందుకు కేంద్రం తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నొక్కి చెప్పారు.


సీతారామ సాగర్ ప్రాజెక్టు అనుమతులు,  మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. ఇరురాష్ట్రాల నీటివాడకంలో పారదర్శకతను పెంపొందించడానికి, భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల వద్ద 35 టెలిమెట్రీ మిషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. ఈ వ్యవస్థ నీటి వినియోగంపై నిజానిజాలను ఎప్పటికప్పుడు అందిస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామ సాగర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్‌తో సహా కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు  మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రాన్ని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: