మూడేళ్ల క్రితం.. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం ప్రారంభించింది.  అప్పుటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ కు సహాయ సహకారాలు అందించాడు.  అయితే దీనివల్ల అమెరికా ఆర్థిక వనరులపై ప్రభావం పడుతుందని అదే తాను అధికారంలో ఉంటే ఈ యుద్ధమే వచ్చేది కాదని ట్రంప్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అనకున్నట్లు గానే  ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.


అయితే ట్రంప్ ఇప్పుడు సడెన్ గా ప్లేట్ మార్చినట్లు కనిపిస్తోంది.  ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం అనేది సాధ్యం కాదని మొన్న కుండబద్దలు కొట్టిన ట్రంప్.. నేడు అసలు రష్యాతో యుద్ధానికి ఎవరు వెళ్లమన్నారంటూ ఉక్రెయిన్ ను తప్పుబట్టారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని కూడా నిందించారు. యుద్ధానికి ముందే రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని తన భవనంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.


సౌదీ అరేబియాలో మంగళవారం నుంచి మొదలైన శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ను భాగస్వామ్యం చేయలేదు. రష్యా -అమెరికా మంత్రుల స్థాయిలో జరుగుతున్న ఈ చర్చలకు ఉక్రెయిన్ ను పిలకపోవడంపై వస్తున్న విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు.  'యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని భావిస్తున్నా. ఇప్పటివరకు అంతా సజావుగానే జరుగుతోంది'' అని చెప్పారు.  మూడేళ్లుగా యుద్ధాన్ని ముగించకుండా ఏం చేస్తున్నావ్ ? అని జెలెస్కీని ఉద్దేశించి విమర్శించారు. అసలు మొదలుపెట్టి ఉండాల్సింది కాదన్నారు.  ఉక్రెయిన్‌ కోసం ఒప్పందం కుదర్చుతానని.. అది పోగొట్టుకొన్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలనని ట్రంప్ అన్నారు.  ప్రజలు ఎవరూ చనిపోరని.. ఏ నగరమూ నేలమట్టం కావాల్సిన అవసరం రాదని వివరించారు. కానీ, వారు అలా జరగకూడదనుకొన్నారని ట్రంప్ జెలెన్‌ స్కీని ఉద్దేశించి అన్నారు.  


జెలెన్ స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్‌ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. ఉక్రెయిన్ లో ఎన్నికలు నిర్వహించాలని.. జెలెన్‌ స్కీకి 4 శాతం మాత్రమే ప్రజా మద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.  నెలాఖరులో తాను పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని, వినాశనం ఆపడానికి ఏదో చేద్దామనుకుంటోందని.. ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారని ట్రంప్‌ వెల్లడించారు.  ఇది బుద్ధి తక్కువ యుద్ధమని ట్రంప్‌ అభివర్ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: