ఆంధ్రప్రదేశ్ లో మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగన్నాయి. మార్చి 1నుండి 19 వరకూ ప్రధమ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. మార్చి 3 నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు రోజూ ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకూ జరుగుతాయి.  26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాయనున్నారు.


ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటికి సంబంధించిన ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 3 నుండి 15వ తేదీ వరకూ జరగనున్నాయి.  325 కేంద్రాల్లో ఈపరీక్షలకు మొత్తం 67వేల 952 మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాయనున్నారు. ఈ పరీక్షల ఏర్పాట్లపై నిన్న రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.


మార్చి-ఏప్రిల్ నెలలు పరీక్షల మాసాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్  ఆయా పరీక్షలు సజావుగా సాగేందుకు తగిన విస్తృత ఏర్పాట్లు చేయాలని కలక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. ఈపరీక్షలకు సంబంధించి 1535 కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. వాటిలో 68 కేంద్రాలను సెన్సిటివ్,36 కేంద్రాలు వల్నరబుల్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని.. అక్కడ గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.


వేసవి దృష్ట్యా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ప్రధమ చికిత్స ఏర్పాట్లు, విద్యుత్, బెంచ్ లు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లకు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో పేపరు లీకేజి వంటి వదంతలు తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు.


పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో పరీక్షల సమయంలో జిరాక్సు కేంద్రాలు,నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: