
దివంగత కీసరి విజయ భాస్కర్‌రెడ్డి మండలంలోని జలపవారిగూడెంకు చెందిన వైసీపీ నేత. హెట్రో డ్రగ్స్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన భాస్కర్‌రెడ్డి రాజకీయంగా వైసీపీ అధిష్టానానికి అతి దగ్గరగా ఉన్నా కూడా ఏనాడు పదవులు.. పవర్ కోసం పాకులాడలేదు. వైసీపీలో భాస్కర్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో ఖచ్చితంగా మంచి పొజిషన్‌లో ఉంటారనే అందరూ అనుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణంతో ఆ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుందా ? వాళ్లకు పొలిటికల్ ఇంట్రస్ట్ ఉందా ? అన్న సందేహాల నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి రాజకీయంగా చక్కటి లైన్ దొరికింది. ఇటీవల పార్టీ అధిష్టానం భాస్కర్ రెడ్డి భార్య కీసరి సరితా విజయ్ భాస్కర్ రెడ్డి ( పండమ్మ ) కి వైసీపీ ఏలూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలు పదవి కట్టబెట్టింది. దీంతో ఈ కుటుంబానికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెప్పినట్లైంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సరితమ్మ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా పని చేశారు. ఆ నియామకం డైరెక్టుగా పార్టీ అధిష్టానం నుంచే వచ్చింది. ఇటు వైస్సార్ ఫ్యామిలీతో పాటు ఎంపీ వైవి. సుబ్బారెడ్డితో ఈ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. జగన్ భార్య భారతిరెడ్డితో కూడా అంతే అనుబంధం ఉంది. సరితమ్మకు జిల్లా పార్టీ మహిళా అధ్యక్షరాలు పగ్గాలు ఇవ్వడంతో ఆమె రాజకీయంగా ఎదిగేందుకు.. తన భర్త ఆశయాలు నిలబెట్టేందుకు ఇది చక్కని అవకాశం. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం అంతటా కూటమి ప్రభంజనం వీచినా కూడా సొంత పంచాయతీలో వైసీపీకి మెజార్టీ రప్పించడంతో కీసరి కుటుంబం పట్టు నిలుపుకున్నట్లైంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ మహిళా విభాగంలో పలు కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాత్ర పోషిస్తే.. రేపటి రోజు పార్టీ పరంగా.. పదవుల పరంగా ఏ అవకాశం వచ్చినా ప్రథమ ప్రాధాన్యత సరితమ్మకే ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఆమె సొంత పంచాయతీ దాటి పెద్దగా బయటకు రాని పరిస్థితి. అయితే ఇప్పుడు ఆమె పదవి నేపథ్యంలో పార్టీ పరంగా జిల్లాలో ఎక్కడికి వెళ్లినా.. రాష్ట్రంలో కూడా పార్టీ ప్రొటోకాల్ ఉంటుంది. ఈ టైంలో ఆమె పార్టీ కోసం.. ఇటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు... పార్టీ లైన్ పరంగా పోరాటం చేస్తుంటే రేపటి రోజు పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మంచి గుర్తింపే ఉంటుంది. మహిళలకు చట్ట సభల్లో 50 శాతం అవకాశాలు వచ్చినా... లేదా జడ్పీ చైర్‌పర్సన్ లేదా ఇతర జిల్లా.. ప్రాంతీయ.. రాష్ట్ర స్థాయి పదవుల్లో ఏవైనా సరితమ్మను వరించే అవకాశం ఉంది.