తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం నడుస్తోంది. అయితే.. ఈ తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల రాజకీయం నడుస్తోందని.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం వాపోయారు. నిజాయితీ గల అభ్యర్ధులను ఎన్నుకోవాలని ఓటర్లకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి, కరీంనగర్ - మెదక్ - అదిలాబాద్ - నిజామాబాద్ ఉపాద్యాయ స్థానంలో వై. అశోక్ కుమార్ కు.. తాము మద్దతిస్తున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కరీంనగర్ - మెదక్ - అదిలాబాద్ - నిజామాబాద్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిలకు తాము మద్దతుస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు.


తాము బలపరుస్తున్న అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలోనే జాబ్ క్యాలెండర్, కులగణన చేపట్టిందన్నారు. విద్యా, వైద్య రంగంలో అభివ్రుద్ది అవకాశాలు పెరుగుతున్నాయని కోదండరాం చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యునివర్షిటిని ఏర్పాటు చేసిందని కోదండరాం గుర్తు చేశారు.


బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు కొట్లాడుతామంటే ఎట్లా అని కోదండరాం ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను దక్కించుకోవాలన్నారు. విద్య, అర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం చెప్పిందని.. రాజ్యాంగం చదవకుండా బీజేపీ నేతలు కుల గణనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కోదండరాం ఎద్దేవా చేశారు.


విపరీతమైన అప్పులతో ఉన్న రాష్ర్టంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కోదండరాం కొనియాడారు. కీలక పథకాలు అమలు అవుతున్నా.. మరికొన్ని హామీలు త్వరలో అమలు చేస్తారని ఆశిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు, సమాజానికి ఇచ్చిన హామీలపై గట్టిగానే అడుగుతున్నామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని కోదండరాం మండిపడ్డారు.




మరింత సమాచారం తెలుసుకోండి: