
వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పదే పదే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన ప్రతి ప్రసంగంలోనూ కమ్మ సామాజిక ప్రస్తావన తీసుకొచ్చి.. కమ్మ సామాజిక వర్గంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా కమ్మ సామాజిక వర్గాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఇక మొన ఎన్నికలకు ముందు కూడా చాలా నియోజకవర్గాలలో కమ్మ సామాజిక వర్గాన్ని తప్పించి.. ఇతర సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించారు.
సాంప్రదాయంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీట్లు.. చిలకలూరిపేట, పరుచూరు, అద్దంకి లాంటి చోట్ల కూడా జగన్ ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీ టికెట్లు కేటాయించారు. ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్ తన ఆలోచనలను పునసమీక్షించు కుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గ సానుభూతి కోసం.. జగన్ కొత్త అస్త్రాన్ని వాడుతున్నట్టు తెలుస్తోంది. జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడానికి ప్రత్యేకంగా వచ్చిన జగన్ .. కమ్మ సామాజిక వర్గంలో కొంత మద్దతు కూడగట్టుకున్నారు.
అలాగే.. ఆ వర్గానికి చెందిన దేవినేని అవినాష్, కొడాలి నాని, కొఠారు అబ్బయ్య చౌదరి లాంటి వాళ్లకు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. విజయవాడలో యువనేతగా ఉన్న దేవినేని అవినాష్‌కు.. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే.. అవినాష్‌కు కచ్చితంగా జగన్ క్యాబినెట్‌లో కమ్మ సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవి ఇస్తామని కూడా జగన్ నుంచి అవినాష్‌కు ఇప్పటికే హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. జగన్ ఇప్పుడు.. ఆ సామాజిక వర్గంలో సానుభూతి సెంటిమెంట్ కోసం ఆ వర్గానికి చెందిన నాయకులను దగ్గరకు తీసుకుంటున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.